Yarapathineni Srinivasa Rao: జగన్‌కి కేజీ, క్వింటాలకి తేడా తెలియదు.. యరపతినేని విసుర్లు
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:19 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు జగన్, వైసీపీ నేతలు ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. గత జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

గుంటూరు జిల్లా: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Gurajala MLA Yarapathineni Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు జగన్, వైసీపీ నేతలు ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. గత జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జగన్‌కి కేజీ, క్వింటాలకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. గంజాయి సాగు తప్పా వ్యవసాయ గురించి జగన్‌కు తెలియదని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐఏఎస్, ఐపీఎస్‌లను జైలుకి పంపించిన చరిత్ర జగన్‌దని ఆక్షేపించారు. మిర్చి యార్డులు తగులబెట్టడం, మిర్చి టిక్కీలు దొంగతనం చేయటం మాత్రమే వైసీపీ నేతలకు తెలుసని దెప్పిపొడిచారు యరపతినేని శ్రీనివాసరావు.
ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తామని జగన్, వైసీపీ నేతలు కలలు కంటున్నారని.. వారివి కలలుగానే మిగిలిపోతాయని విమర్శించారు. జగన్, వైసీపీ నేతలు రాక్షసులు, పశువులుగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. విషపు రంగు నీళ్లని మద్యం పేరుతో అమ్మి అనేకమంది చావులకు జగన్ కారణమయ్యారని ఫైర్ అయ్యారు. లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని.. ఇందులోనే జగన్ పేరు బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు. దమ్ముంటే వైసీపీ నేతలు ఎవరిని నరుకుతారో వాళ్ల పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు. జగన్, వైసీపీ నేతలు దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు యరపతినేని శ్రీనివాసరావు.
జగన్, వైసీపీ నేతలు రాజకీయ విమర్శలు చేయాలి గాని.. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఏపీని అభివృద్ధి చేసింది ముమ్మాటికీ సీఎం చంద్రబాబునే అని ఉద్ఘాటించారు. సొంత బాబాయిని చంపిన చరిత్ర వారిదని విమర్శించారు. సొంత పార్టీ నేతలనే జగన్ రప్పా రప్పా ఆడిస్తారని సెటైర్లు గుప్పించారు. జగన్‌తో వైసీపీ నేతలే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమీ అధినేతలను వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. గురజాల నియోజకవర్గంలో వైసీపీ అక్రమాలపై విచారణ జరుగుతోందని అన్నారు. ఇలాంటి పార్టీ నుంచి బయటకు రావాల్సిన అవసరాన్ని కార్యకర్తలు గుర్తుంచుకోవాలని చెప్పారు. పల్నాడులో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తక్కువ ఖర్చుతోనే గ్రీన్ హైడ్రోజన్
జగన్ మెక్కిన సొమ్మంతా కక్కిస్తాం
Read latest AP News And Telugu News