Ravi Kumar: గ్రీన్ ఎనర్జీతో ఏపీలో భారీగా పెట్టుబడులు
ABN , Publish Date - Jan 24 , 2025 | 06:35 PM
Minister Gottipati Ravi Kumar: విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా మారి ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.

విజయవాడ: రాబోయే ఐదేళ్ల కాలంలో ఏపీ మొత్తం క్లీన్ ఎనర్జీనే ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రీసెర్చ్ కాంక్లేవ్ -2025లో ముఖ్య అతిథిగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మీడియాతో మాట్లాడుతూ... ప్రతీ ఇంట్లో ఒక వ్యక్తి ఉద్యోగస్తుడై ఉండాలని నాడు చంద్రబాబు నాయుడు సంకల్పించారని అన్నారు.
సీఎం చంద్రబాబు అభివృద్ధి చేసిన ఐటీ రంగంతో తెలుగు వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. గ్రీన్ ఎనర్జీతో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు, ఉద్యోగాలతో పాటు పొల్యూషన్ ఫ్రీ స్టేట్‌గా ఏపీ మారుతుందని తెలిపారు. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా మారి ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు తగ్గుతున్నాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్
విజయవాడ: రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు తగ్గుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొని మాట్లాడారు. అన్ని స్థాయిల్లో వ్యవస్థలో పద్ధతి ప్రకారం అన్ని పదవుల నిర్ణయం జరుగుతుందని చెప్పారు. అధికారంలో భాగస్వామ్యం ఉంది కనుక ప్రజల సమస్యలు తీర్చడంలో ముందున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
సూర్యఘర్ ద్వారా ప్రతీ ఇంటికి ఆదాయ వనరుగా మార్చే పనులు చేస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. PPP మోడ్‌లో మెడికల్ కాలేజీలు తేవాల్సిన పరిస్ధితికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. నిధులు సరిగా ఇవ్వకుండా కాలేజీల నిర్మాణం జరగకపోవడానికి గత ప్రభుత్వం కారణమని ఆరోపించారు. సిద్ధార్ధ మెడికల్ కాలేజీలో విద్యార్ధినులకు హాస్టల్ లేదన్నారు. P4 మోడల్‌లో మెడికల్ కాలేజీలు వచ్చిన దానికి తగిన ఫ్రీ సీట్లు ఉంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.