Share News

Sri Rama Navami Celebrations: మార్మోగిన రామ తీర్థం

ABN , Publish Date - Apr 07 , 2025 | 03:51 AM

విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తుల మధ్య సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులతో పాటు ప్రముఖులు హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు

Sri Rama Navami Celebrations: మార్మోగిన రామ తీర్థం

  • అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

  • ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి పట్టువస్త్రాల సమర్పణ

  • ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వేడుకగా ధ్వజారోహణ

  • అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

  • ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి పట్టువస్త్రాల సమర్పణ

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వేదికపై వేలాది మంది భక్తుల సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పెళ్లితంతు సాగింది. ప్రధానంగా జీలకర్ర, బెల్లం, మంగళసూత్రధారణ, ముత్యాల తలంబ్రాలు చల్లుకునే ప్రక్రియలను చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు. రామనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆలయ సంప్రదాయం ప్రకారం.. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వంశపారంపర్య ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజుతోపాటు ఆయన కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దంపతులు, రాష్ట్ర ఎస్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దంపతులు, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డీవీజీ శంకరరావు తదితరులు హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఈవో వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి.


ఒంటిమిట్టలో సీతారాముడికి ప్రత్యేక పూజలు

బ్రహ్మోత్సవాలకు వేడుకగా ధ్వజారోహణ

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ధ్వజారోహణ ఘట్టం వేడుకగా జరిగింది. శ్రీరామ నవమి కావడంతో వేకువజామునే స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో వృషభ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర బద్ధంగా గరుడ పటాన్ని ప్రతిష్ఠించి ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. దానికి ముందు గరుడ పటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి గరుడ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం అనంతరం సకల దేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. శ్రీరామ నవమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఒంటిమిట్టకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..

Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్

Updated Date - Apr 07 , 2025 | 03:53 AM