CPI: గవర్నర్లందరూ ఆర్‌ఎస్ఎస్ వాళ్లే
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:56 AM
రాష్ట్రాల గవర్నర్లందరూ ఆర్‌ఎస్ఎస్‌కి చెందినవారని, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ విమర్శించారు. గోశాల అంశాన్ని ఇక ముగించాలని, రాజధాని నిర్మాణానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది

గోశాల విషయాన్ని ఇంతటితో ఆపండి: నారాయణ, రామకృష్ణ
అమరావతి/తిరుపతి(ఆటోనగర్), ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల గవర్నర్లందరూ ఆర్‌ఎ్‌సఎస్ వాళ్లేనని, ప్రజాస్వామ్యానికి వారు పాతరేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం తిరుపతిలో నారాయణ, విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయ వ్యవస్థలను ధ్వంసం చేసే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన బిల్లులను తొక్కిపెట్టే అధికారం గవర్నర్‌లకు లేదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యవాదులంతా స్వాగతించారని చెప్పారు. అయితే ఉప రాష్ట్రపతి న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలతో దాడి చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లు విషయంలోనూ ఆయన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల ప్రజలకున్న విశ్వాసాలతో స్వార్థ రాజకీయాల కోసం చెలగాటమాడవద్దని నారాయణ నేతలను కోరారు.
గోశాల విషయాన్ని ఇంతటితో ఆపాలని చేతులెత్తి జోడించి చెబుతున్నానన్నారు. కాగా, అమరావతిలో రాజధాని నిర్మాణానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రామకృష్ణ తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని పూర్తిగా వ్యతిరేకించామని గుర్తు చేశారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. కేవలం ప్రచారం కోసమే ప్రధాని నరేంద్రమోదీ వచ్చేనెల 2న అమరావతికి వస్తున్నారని విమర్శించారు.