Share News

Enforcement Directorate : హయగ్రీవ కేసులోకదిలిన డొంక!

ABN , Publish Date - Feb 08 , 2025 | 04:47 AM

హయగ్రీవ ఫార్మ్‌ అండ్‌ డెవలపర్స్‌ కేసులో కీలక వివరాలు వెలుగుచూశాయి. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.44.75 కోట్ల స్థిర, చరాస్తులను జప్తు చేసినట్టు

Enforcement Directorate : హయగ్రీవ కేసులోకదిలిన డొంక!

  • మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

  • వృద్ధాశ్రమం కోసం కొన్నసర్కారు భూమిని నకిలీ పత్రాలతో లాక్కున్న ఎంవీవీ!

  • సొంత అవసరాలకు ప్రభుత్వ భూమి వినియోగం

  • ఆయనకు, మరో ముగ్గురికి రూ.87.64 కోట్లు లబ్ధి

  • గత ఏడాది కేసుపెట్టిన హయగ్రీవ యజమాని

  • దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

  • ఎంవీవీ ఇల్ల్లు, కార్యాలయంలో సోదాలు

  • కీలక పత్రాల ఆధారంగానే ఇప్పుడు చర్యలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): తీగ లాగితే డొంక కదిలినట్లుగా హయగ్రీవ ఫార్మ్‌ అండ్‌ డెవలపర్స్‌ కేసులో కీలక వివరాలు వెలుగుచూశాయి. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.44.75 కోట్ల స్థిర, చరాస్తులను జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం ప్రకటించింది. ఇందులో వైసీపీ నేత, విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఆస్తులు కూడా ఉండడం గమనార్హం. వృద్ధులు, అనాథలకు ఆశ్రమం నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి తాను ఎండాడలో కొనుగోలు చేసిన 12.51 ఎకరాలను గద్దె బ్రహ్మాజీ, జి.వెంకటేశ్వరరావు (జీవీ), ఎంవీవీ సత్యనారాయణ.. సంతకాలు ఫోర్జరీ చేసి, నకిలీ డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకున్నారని హయగ్రీవ ఫార్మ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు విశాఖలోని ఆరిలోవ పోలీసు స్టేషన్‌లో గత ఏడాది కేసు పెట్టారు. దానిపై ఈడీ విచారణ చేపట్టింది.


దర్యాప్తులో భాగంగా గత ఏడాది అక్టోబరులో ఎంవీవీ ఇల్లు, లాసన్స్‌బే కాలనీలోని కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి ఆ భూమిని 2010లో రూ.5.63 కోట్లకు కొనుగోలు చేశారని, అయితే నాటి మార్కెట్‌ విలువ ప్రకారం ఆ ఆస్తి విలువ రూ.30.25 కోట్లు ఉంటుందని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘గద్డె బ్రహ్మాజీ, జి.వెంకటేశ్వరరావు, అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హయగ్రీవ సంస్థలో 2020లో భాగస్వాములుగా చేరారు. 2021-22 మధ్య దాదాపు 30 విక్రయ ఒప్పందాల (సేల్‌ డీడ్స్‌) ద్వారా ఆ భూమిని బ్రహ్మాజీ, జీవీ, ఎంవీవీ బిల్డర్స్‌ పేరు మీదకు జగదీశ్వరుడు బదిలీ చేశారు. ఆయన కూడా 2010-11, 2019లో ఎనిమిది మంది వేర్వేరు వ్యక్తులకు ఆ భూమిని విక్రయించడానికి ఒప్పందాలు చేసుకున్నారు. వాటి ద్వారా లబ్ధి కూడా పొందారు. ఇది ‘ప్రొసీడ్స్‌ ఆఫ్‌ క్రైమ్‌’ (పీవోసీ). జగదీశ్వరుడు, గద్దె బ్రహ్మాజీ, జీవీ, ఎంవీవీ సత్యనారాయణ రూ.87.64 కోట్లు లబ్ధి పొందారు. ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు. ప్రభుత్వ భూమిని ఒక ఉద్దేశం కోసం తీసుకుని దుర్వినియోగం చేసి, అక్రమంగా లబ్ధి పొందినందుకు మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశాం. వారి రూ.44.75కోట్ల ఆస్తులు జప్తుచేశాం’ అని వివరించింది. ఇందులో స్థిరాస్తుల విలువ రూ.42.03 కోట్లు, చరాస్తులు రూ.2.71 కోట్లు. ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ బిల్డర్స్‌ ఆస్తులతో పాటు గద్దె బ్రహ్మాజీ భార్య, జగదీశ్వరుడి భార్య ఆస్తులు కూడా ఉన్నట్లు ఈడీ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 08 , 2025 | 04:47 AM