Share News

CM Chandrababu : సమన్వయంతో పనిచేయండి

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:39 AM

మ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గెలిపించే బాధ్యతను కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

CM Chandrababu : సమన్వయంతో పనిచేయండి

  • గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి

  • కూటమి నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గెలిపించే బాధ్యతను కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మూడు పార్టీల నాయకులు ఎన్నికలకు ముందు సమన్వయంతో పనిచేసిన విధంగానే ఇప్పుడూ పనిచేయాలని కోరారు. కూటమి నాయకులతో శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫ్‌రెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, 27న పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఈలోగా ఆయా నియోజకవర్గాల్లోని ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరును కలిసి.. కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచేలా కృషి చేయాలన్నారు. చదువుకున్న వారంతా కూటమితోనే ఉన్నారంటూ ఎవరూ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దన్నారు. ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని సూచించారు. ఏ ఎన్నికలు వచ్చినా మనం గెలిచినప్పుడే సుస్థిర పాలన సాధ్యమవుతుందన్నారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లోనే అన్ని ఇబ్బందులను అధి గమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్న విషయాన్ని తెలియజేయాలని సూచించారు. ‘‘రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడం లేదు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నాం.


కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, రాజధాని అమరావతికి ఆర్థికసాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్‌తో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ విషయాలన్నీ ఓటర్లకు వివరించండి’’ అని చంద్రబాబు కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని, ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయని ఈ విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలన్నారు. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

వ్యవస్థలు ధ్వంసం చేసి ధర్నాలా?: సోమిరెడ్డి

అన్ని వ్యవస్థలనూ ధ్వంసంచేసిన వైసీపీ నేడు ధర్నాలు చేయడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి శుక్రవారం విమర్శించారు. ‘వైసీపీ హయాంలో తప్పులు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి అధికార వ్యవస్థలో ఇంకా నిర్లిప్తత ఎందుకో అర్థం కావడంలేదు. ఏ1, ఏ2 సహా వైసీపీ హయాంలో తప్పుచేసిన వారందరిపైనా ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీడియాలో సాక్షాల్యతోసహా వైసీపీ అక్రమాలు అవినీతిని రోజూ వెలుగులోకి వస్తోంది. వైసీపీ హయాంలో విద్యావ్యవస్థ దుస్థితిపై అసర్‌ నివేదిక చూసి వైసీపీ నేతలు తలెక్కడ పెట్టుకుంటారు?’ అని అన్నారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:39 AM