Bandi Sanjay On TTD Staff: టీటీడీలో ఆ ఉద్యోగులను తక్షణమే తొలగించాలి.. బండి సంజయ్ డిమాండ్
ABN , Publish Date - Jul 11 , 2025 | 10:25 AM
Bandi Sanjay On TTD Staff: టీటీడీలోని అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతోపాటు పురాతన ఆలయాలనూ టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు.

తిరుమల, జులై 11: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడిని కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఈరోజు (శుక్రవారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం కేంద్రమంత్రి బండి సంజయ్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీలో 1000 మందికి పైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని తెలిపారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులకు హిందూ సనాతన ధర్మంపై విశ్వాసం లేదన్నారు. టీటీడీ పాలకమండలి వెంటనే స్పందించి వారందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల ఓ ఉద్యోగిని తొలగించడంపై స్పందించిన కేంద్రమంత్రి.. ఒకరిని తొలగిస్తే సరిపోదని, టీటీడీలోని అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అన్యమస్థులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతోపాటు పురాతన ఆలయాలను టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లెందు రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని కేంద్రమంత్రి కోరారు. శ్రీవారి సేవలో నిజమైన భక్తి, నిబద్ధతతో పనిచేసే వారికే అవకాశం కల్పించాలంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి
అలాంటి ఫొటోలు తీయకండి.. పాపరాజీలపై హీరోయిన్ ఆగ్రహం..
హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై ఇక కొరడా
Read Latest AP News And Telugu News