Share News

Mango farmers: ఐదేళ్లలో మామిడి రైతులకు ఎంతిచ్చావ్‌ జగన్‌?

ABN , Publish Date - Jul 12 , 2025 | 01:07 AM

రైతుల పక్షాన తాము నిలబడుతున్నామని, చంద్రబాబు ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రకటించడం, శుక్రవారం సాక్షి ప్రధాన పత్రికలో ఆయన కొన్ని ప్రశ్నల్ని అడగడంపై జిల్లా రైతుల్లో చర్చ నడుస్తోంది.

Mango farmers: ఐదేళ్లలో మామిడి రైతులకు ఎంతిచ్చావ్‌ జగన్‌?
బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డు వద్ద బుధవారం జగన్‌ మెప్పు కోసం రోడ్డుపై వైసీపీ శ్రేణులు పారబోసిన మామిడి కాయలు

ఈసారి 5 లక్షల టన్నుల దిగుబడితో ధరల పతనం

చిత్తూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రైతుల పక్షాన తాము నిలబడుతున్నామని, చంద్రబాబు ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రకటించడం, శుక్రవారం సాక్షి ప్రధాన పత్రికలో ఆయన కొన్ని ప్రశ్నల్ని అడగడంపై జిల్లా రైతుల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అడక్కముందే రైతులకు రూ.4 సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటుంటే, ఐదేళ్లలో ఏనాడూ నయా పైసా ఇవ్వని జగన్‌ అబద్ధాలను వల్లె వేయడంపై అన్నదాతల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.జగన్‌ పలుకుల్లో వాస్తవాల గురించి చర్చించుకుంటే..

జగన్‌: ఏటా మే 10-15 మధ్య తెరవాల్సిన పల్ప్‌ ఫ్యాక్టరీలు ఈ ఏడాది ఎందుకు ఆలస్యంగా తెరిచారు?

వాస్తవం: ఈసారి వర్షాలు అధికంగా పడడంతోకాయలు ఆలస్యంగా పక్వానికి వచ్చాయి. పక్వానికి రాని కాయల్లో తియ్యదనం ఉండదు. తియ్యదనం లేకుండా ఫ్యాక్టరీలు కొనుగోలు చేయవు. అందుకే జిల్లాలోని ఫ్యాక్టరీలు పక్వానికి వచ్చాక జూన్‌లో తెరచుకున్నాయి.

జగన్‌: మీ గల్లా ఫ్యాక్టరీ, శ్రీని ఫుడ్స్‌.. ఇలా మీ వాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా?

వాస్తవం: అసలు ఈసారి శ్రీని ఫుడ్స్‌ ఫ్యాక్టరీ పనిచేయలేదు. గల్లా ఫ్యాక్టరీ జిల్లాలోనే అత్యధికంగా రైతులకు రూ.6 ఇస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ ఫ్యాక్టరీ రూ.4 మాత్రమే ఇస్తోంది. అందులోనూ తమ పార్టీ సానుభూతిపరులైన రైతుల నుంచే కొంటున్నారు. ఇప్పటికి 8 వేల టన్నులే సేకరించారు. అలాగే వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న ర్యాంపుల్లో రూ.2 మాత్రమే ఇస్తున్నారు.

జగన్‌: వైసీపీ పాలనలో మేం కిలోకు రూ.29 ఇస్తే.. ఇప్పుడు రూ.రెండున్నర నుంచి రూ.మూడు ఇస్తారా?

వాస్తవం: గతేడాది రూ.29 చొప్పున కొనుగోలు చేసింది ప్రభుత్వం కాదు, ఫ్యాక్టరీలు. అప్పుడు డిమాండ్‌ ఉండడంతో కొన్నారు. గతేడాది 1.7 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే రావడంతో ఫ్యాక్టరీలు కొన్నాయి. ఈసారి చిత్తూరు జిల్లాలో మాత్రమే 5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఇలాగే 2023లో అధిక దిగుబడి వచ్చి ధర పతనమైపోయింది.అప్పట్లో జగన్‌ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోలేదు.


జగన్‌: ఇప్పటివరకు రూ.4 సబ్సిడీ ఎంత మంది రైతులకు అందించారు? రూ.8 చొప్పున ఎంత మందికి ఫ్యాక్టరీలు చెల్లించాయి?

వాస్తవం: ఇప్పటివరకు జిల్లాలో 40,977 మంది రైతుల నుంచి 2,85,695 టన్నుల మామిడిని కొనుగోలు చేశారు. ఇంకా సేకరణ జరుగుతోంది. రెండు వారాల్లో పూర్తవుతుంది. ఆయా ఫ్యాక్టరీల వద్ద ప్రభుత్వ ఉద్యోగుల బృందం రైతుల నుంచీ బ్యాంకు అకౌంట్‌ వంటి వివరాలు సేకరిస్తోంది. తాజాగా రూ.260 కోట్ల సబ్సిడీ విడుదల చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రైతుల ఖాతాల్లో ఒకేసారి నిధులు జమ కానున్నాయి. జిల్లాలో ఫ్యాక్టరీలు కిలోకు రూ.6 అందిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని మాత్రమే రూ.5 ఇస్తున్నాయి. ప్రతీసారిలాగే ఒకేసారి బిల్లుల్ని రైతులకు అందిస్తాయి.

జగన్‌: ఇక్కడ రూ.12 మద్దతు ధర అమలు కావడం లేదు. అదే పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే రూ.16 చొప్పున కొంటున్నారు.

వాస్తవం: కర్ణాటకలో రూ.16 చొప్పున కాయల్ని కొనడం లేదు. అది మద్దతు ధర మాత్రమే. అక్కడ అనేక ఆంక్షలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.4 ఇస్తున్నాయి. కర్ణాటకలో రైతుకు గరిష్టంగా రూ.40 వేలు అందితే, ఇక్కడ గరిష్టం లేదు. రూ.2 లక్షలు అందినవారూ ఉన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 01:07 AM