Share News

AP Police Instructions: తిరుమలకు వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

ABN , Publish Date - Nov 30 , 2025 | 08:16 PM

దిత్వా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో భక్తులకు, జిల్లా ప్రజలకు భద్రతా సూచనలు సూచించారు .

AP Police Instructions: తిరుమలకు వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..
AP Police Instructions

తిరుపతి, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): తిరుపతి (Tirupati) ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని ప్రపంచ నలుమూలాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. క్షణకాలమైనా గోవిందుడు దర్శనం దొరికితే చాలని భక్తులు భావిస్తుంటారు. ఎన్నో వ్యయాప్రయాసలు కోర్చి వడ్డీకాసులవాడి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. అయితే, దిత్వా తుఫాను (Ditwah Cyclone) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.


ఈ క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో భక్తులకు, జిల్లా ప్రజలకు భద్రతా సూచనలు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాగులు, వంకలు, చెరువులు, డ్యామ్‌లు, రిజర్వాయర్లకు దూరంగా ఉండాలని చెప్పుకొచ్చారు. రాత్రి వేళల్లో అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ ఓ ప్రకటన విడుదల చేశారు.


దిత్వా తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. పిచ్చటూరు, అరనియార్ డ్యామ్, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఆరణ్య రిజర్వాయర్‌ కెపాసిటీ 1.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.6 టీఎంసీలకు చేరుకోవడంతో వరద పెరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకుంటూ, అత్యవసర పరిస్థితులు వస్తే గేట్లను ఎత్తివేయడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.


పోలీసుల సూచనలు ఇవే...

  1. పిల్లలను నీటి ప్రవాహం, నిల్వ ప్రదేశాలకు అనుమతించకూడదు. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తాకరాదు. కిందపడిన కరెంటు తీగలను పట్టుకోరాదు. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయిన ప్రాంతాలకు వెళ్లరాదు.

  2. భారీ వర్షాలు, నీటి మట్టం పెరుగుదల గమనించిన వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి.

  3. ప్రమాద ప్రాంతాలకు వెళ్లి ఫొటోలు లేదా వీడియోలు తీయడం పూర్తిగా నిషేధం.

  4. ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో వాహనాలను ఆపరాదు, నడవడానికి ప్రయత్నించకూడదు.

  5. ఏవైనా ప్రమాద సూచనలు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

  6. ఈరోజు, రేపు దిత్వా తుఫాను ప్రభావం కొనసాగనున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలి.

  7. అత్యవసర అవసరాలకే బయటకు రావాలి.

  8. ముఖ్యంగా వాగులు, వంకలు, కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద నీటి మట్టం పెరిగే ప్రమాదం ఉన్నందున ‘ఎప్పుడూ వెళ్లే దారే కదా’ అని భావించి ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు.

  9. పిల్లలను నీటి నిల్వ ప్రదేశాలకు అనుమతించవద్దని సూచించారు.

  10. ప్రజల భద్రత కోసం పోలీసులు, ఫైర్ సర్వీసులు, 108 అంబులెన్స్‌తో పాటు ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి.

  11. ప్రమాద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు పహారా, పర్యవేక్షణ నిరంతరం కొనసాగిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పేర్కొన్నారు.


అత్యవసర హెల్ప్‌లైన్‌లు:

తిరుపతి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 80999 99977

ఎమర్జెన్సీ నంబర్: 112

తిరుపతి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 0877-2236007


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల

Read Latest AP News and National News

Updated Date - Nov 30 , 2025 | 09:07 PM