CM Chandrababu : కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:48 AM
ఎన్డీయే కార్యకర్తలంతా కష్టపడి 21 పార్లమెంటు సీట్లు గెలిపించారని, ఇంకొంచెం కష్టపడి ఉంటే 25కు 25 సీట్లూ గెలిచేవాళ్లమని సీఎం చంద్రబాబు అన్నారు.

ఏపీలో అభివృద్ధిని పట్టాలెక్కించాం.. కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం
రాజధాని అమరావతిని గట్టెక్కించాం.. పోలవరం ప్రాజెక్టుకు ప్రాణం పోశాం
కేంద్రం విశాఖ రైల్వే జోన్ ఇచ్చింది.. స్టీల్ ప్లాంట్‌కు రూ.13 వేల కోట్ల నిధులు
ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచంలో భారత్ నంబర్ వన్‌గా ఎదుగుతుంది
నదుల అనుసంధానంతోనే సీమ సస్యశ్యామలం.. మైదుకూరు సభలో సీఎం
కడప, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఎన్డీయే కార్యకర్తలంతా కష్టపడి 21 పార్లమెంటు సీట్లు గెలిపించారని, ఇంకొంచెం కష్టపడి ఉంటే 25కు 25 సీట్లూ గెలిచేవాళ్లమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ 21 సీట్లు సంజీవనిగా మారాయని, వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నామని, కానీ పూర్తిగా తొలగిపోలేదన్నారు. రాజధాని అమరావతిని గట్టెక్కించామని, పోలవరం ప్రాజెక్టుకు ప్రాణం పోశామని పేర్కొన్నారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ ఇచ్చిందని, విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.13వేల కోట్లు ఇచ్చి ఆదుకుంటోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు నాంది పలికామన్నారు. తనను, మోదీని, పవన్ కల్యాణ్‌ను నమ్మి ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. శనివారం కడప జిల్లా మైదుకూరులో విద్యార్థులతో కలసి స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మైదుకూరులోనే ఎన్టీఆర్ 29వ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘ఎన్నికల ముందు నవ్వుతూ మాట్లాడే పరిస్థితి లేదు. కూర్చోవాలంటే భయం, నవ్వాలంటే భయం, బయటకు రావాలంటే భయం. ప్రెస్‌వాళ్లు ఏదైనా ఆర్టికల్ రాయాలంటే వణుకు. కానీ ఈరోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్యం.
విర్రవీగిన నియంతలంతా కాలగర్భంలో కలిసిపోయారు. రాష్ట్రంలో అభివృద్ధిని పట్టాలెక్కించాం. రాయలసీమతో పాటు రాష్ట్రంలో జాతీయ రహదారులకు రూ.50 వేలకోట్లు ఖర్చు పెట్టి మూడేళ్లలో పూర్తిచేస్తున్నాం. రూ.70 వేల కోట్లతో రైల్వే లేన్లు, రైల్వే స్టేషన్లు పూర్తిచేసే బాధ్యత తీసుకున్నాం. స్వర్ణాంధ్ర విజన్ తయారుచేశాం. 64 లక్షల మంది పింఛన్లను పర్యవేక్షిస్తున్నానంటే అది టెక్నాలజీ మహిమ’ అని చంద్రబాబు అన్నారు.
రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం
‘పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. ఈ ఏడాది 4 వేల టీఎంసీలు వృథా అయ్యాయి. కానీ ముందు జాగ్రత్త చేసి శ్రీశైలంతో పాటు రాయలసీమలో రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నాయంటే అది టీడీపీ చూపిన చొరవ. పోలవరం నుంచి 200-300 టీఎంసీలు రాయలసీమకు వస్తే ప్రగతి వైపు పరుగు పెడుతుంది. అందుకే పోలవరాన్ని పట్టాలెక్కించాం. గత ప్రభుత్వం డయాఫ్రం వాల్‌ను ముంచేసి పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేసింది. ఈరోజు మళ్లీ కేంద్ర సహకారంతో ఫేజ్-1కింద రూ.12,200కోట్లు ఇస్తే డయాఫ్రం వాల్ ప్రారంభిస్తున్నాం. రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నా. పోలవరం-కృష్ణా అనుసంధానం చేశాం. కృష్ణాడెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇచ్చాం. రాబోయే రోజుల్లో గోదావరి-పెన్నా, పోలవరం-బనకచెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే గేమ్ చేంజర్‌గా తయారవుతుంది. రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బతికే రోజు వస్తుంది. బనకచెర్లకు నీరు తెస్తే అక్కడి నుంచి తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి వీటితో పాటు సోమశిలకు వెళ్తాయి. అక్కడ నుంచి కండలేరుకు వెళ్లి మళ్లీ తిరుపతికి వచ్చి వేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉన్న బాలాజీ రిజర్వాయర్‌కు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది నా కల’ అని చంద్రబాబు అన్నారు.
సీమ అభివృద్ధి బాధ్యత మాది
‘రాయలసీమ రుణం ఎలా తీర్చుకోవాలా అని అనుక్షణం ఆలోచిస్తుంటా. కరువు జిల్లాలైన సీమను అభివృద్ధి చేసే బాధ్యత మాది. బాగా వర్షాలు వచ్చినపుడు నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. వర్షాలు లేనపుడు కరువుబారిన పడుతున్నాం. కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. ఇది సాధ్యం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఇది చేసి చూపిస్తాం. ఒకప్పుడు రాయలు ఏలిన రతనాల సీమలో తర్వాత కరువు వచ్చి నీళ్లు కూడా లేవు. అనంతపురం లాంటి జిల్లా ఎడారిగా మారుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. రాయదుర్గం ప్రాంతం ఎడారిగా మారే సూచనలు వచ్చాయి. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్టులు ప్రారంభించి రాయలసీమ మళ్లీ రతనాల సీమ కావాలని పునాది వేసిన వ్యక్తి ఎన్టీఆర్. రాజోలి బండ ఆనకట్ట అభివృద్ధి చేసి 90 వేల ఎకరాలకు నీరు అందించి నీటిఎద్డడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
10కి 10 సీట్లు గెలవాలి
‘తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ రాని విజయం మొన్నటి ఎన్నికల్లో వచ్చింది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాం. 93 శాతం సీట్లు మనమే గెలిచాం. కడప జిల్లాలో పదికి ఏడు గెలిచాం. కడప పార్లమెంటులో ఏడుకు ఐదు గెలిచాం. ఇంకొంచెం కష్టపడి ఉంటే కడప పార్లమెంటును గెలిచేవారం. గత ఐదేళ్లలో ఏం జరిగిందో చూశారు. ఈ ఐదేళ్లలో ఏ విధంగా వెలుగులు వస్తాయో మీరే చూడబోతున్నారు. ఆ తర్వాత ఏడుకు ఏడు గెలిపించాలి, పదికి పది గెలవాలి. పార్లమెంటు స్థానాలు గెలవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం’ అని అన్నారు.
టీడీపీలో కోటి సభ్యత్వాలు
‘టీడీపీకి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్‌ను అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. తర్వాత యునైటెడ్ ఫ్రంట్‌కు నేను కన్వీనర్‌గా ఉండి ఇద్దరిని ప్రధానులుగా చేశాం. ఎన్డీయే-1లో వాజ్‌పేయికి సహకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. ఎన్డీయే-2లో మోదీ నాయకత్వంలో 2014-19లో పనిచేశాం. ఇపుడు పనిచేస్తున్నాం. మోదీ నాయకత్వంలో 2047కల్లా దేశం నం-1గా కాని, నం-2గా కాని ఎదుగుతుంది. టీడీపీ ప్రాంతీయ పార్టీ అనే కానీ జాతీయ భావాలతో పనిచేసిన పార్టీ. కోటి సభ్యత్వాలు టీడీపీలో ఉన్నాయి. ఇటీవల మంత్రి లోకేశ్ కార్యకర్తల సంక్షేమానికి రూ.130కోట్లతో పెద్దపీట వేశారు. కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వారికి రూ.5లక్షలు బీమా ఇచ్చే ఏకైక పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
పారిశ్రామిక కేంద్రంగా కొప్పర్తి
‘కడప జిల్లాలో కొప్పర్తికి కేంద్రం రూ.2300 కోట్లు ఇచ్చింది. కొప్పర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసి, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. స్టీల్‌ప్లాంట్ కూడా వస్తే జిల్లా ప్రగతి జరుగుతుంది. ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడే ఉంటుంది. గండికోట ఆరోజు ఎన్టీఆర్ కట్టిందే. ప్రపంచంలోనే పది అందమైన ప్రదేశాల్లో గండికోట ఒకటి. కడప జిల్లా హార్టికల్చర్ హబ్‌గా తయారవుతుంది. వరి పంట కంటే పండ్ల తోటలు వేసుకుంటే రెండు మూడురెట్లు ఆదాయం వస్తుంది. రాయలసీమలో ఎక్కువగా ఆదాయం వచ్చే జిల్లాలు కడప, అనంతపురం. కడప జిల్లాలో ఒకప్పుడు ముఠాకక్షలు, చంపుకొనే పరిస్థితి ఉండేది. వాటిని అణచివేసిన పార్టీ టీడీపీ’ అని చంద్రబాబు అన్నారు.