Minster Ram Mohan Naidu: ఈ ఘనత చంద్రబాబుదే
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:27 AM
గత ఆరు నెలలుగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఎప్పుడు కలిసినా విశాఖ ఉక్కుకు న్యాయం చేయాలని కోరారని, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు: రామ్మోహన్ నాయుడు
ప్రజల్లో అసంతృప్తి తొలగిపోయింది: శ్రీనివాస వర్మ
న్యూఢిల్లీ, విశాఖపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): గత ఆరు నెలలుగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఎప్పుడు కలిసినా విశాఖ ఉక్కుకు న్యాయం చేయాలని కోరారని, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంరఽధుల హక్కు అన్న సత్యాన్ని గుర్తించి ఉదారంగా వ్యవహరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఉక్కు మంత్రి కుమారస్వామి ప్లాంట్‌ను సందర్శించి కార్మికులు, అధికారులతో చర్చించారని తెలిపారు. ఏపీకి ప్రాతినిఽధ్యం వహిస్తున్న మంత్రి మాదిరే కుమారస్వామి పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. గత పదేళ్లుగా ఉత్తరాంధ్ర ఎంపీగా స్టీల్ ప్లాంట్ సమస్యలను తాను పార్లమెంట్‌లో లేవనెత్తానని చెప్పారు. కాగా, ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్, ఉక్కు మంత్రి కుమారస్వామితోపాటు సీఎం చంద్రబాబు కృషి వల్ల ఈ నిధులు మంజూరయ్యాయని సహాయమంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో స్టీల్‌ప్లాంట్‌కు పూర్వవైభవం వస్తుందని ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు.
కార్మిక సంఘాల హర్షం
విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆఖరి దశలో ఉన్న కర్మాగారానికి ఆర్థిక ప్యాకేజీ ఊపిరి పోసినట్టేనని స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కేవీడీ ప్రసాద్ అన్నారు. విశాఖ ప్లాంట్‌కు కేంద్రం సాయం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే దీనివల్ల సమస్య పరిష్కారం కాదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు చెప్పారు. ఏడాదికి అవసరమైన ముడి ఇనుముకే రూ.18 వేల కోట్లు కావాలన్నారు. విశాఖ ఉక్కుకూ సొంత గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ చర్యలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కృషి చేయడం మంచి విషయమని, స్టీల్‌ప్లాంటుకు పూర్వ వైభవం తెచ్చే దిశగా మరింత కష్టించి ముందుకు సాగుతామని ఉక్కు గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు కె.ఎ్‌స.ఎన్.రావు అన్నారు. ప్యాకేజీతో తాత్కాలికంగా కొంత మేర ఉపయోగం ఉన్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం మాత్రం కాదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ అన్నారు. కర్మాగారంపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతూనే ఉందని, సెయిల్‌లో విలీనం చేస్తే ప్లాంటుకు లాభం ఉంటుందని చెప్పారు. సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్రం ముందుకురావాలన్నారు.