Tadipatri Tension:పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
ABN , Publish Date - Nov 12 , 2025 | 09:59 AM
తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు.
అనంతపురం, నవంబర్ 12: జిల్లాలోని తాడిపత్రిలో (Tadipatri) మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి పట్టణంలో టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈరోజు (బుధవారం) పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Former MLA Ketireddy Pedda Reddy) నిర్ణయించారు. మరోవైపు తాడిపత్రిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి (MLA JC Asmit Reddy) శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. అంతేకాకుండా పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ర్యాలీని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఒక పార్టీ ఇన్‌ఛార్జిగా తాను కార్యక్రమాలు చేయకూడదా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే శాంతి భద్రతల సమస్య వస్తుందని ర్యాలీని అడ్డుకున్నామని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ఎప్పుడు ఏ జరుగుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పోలీసులు నిరాకరించినప్పటికీ పెద్దారెడ్డి తన ర్యాలీని కొనసాగిస్తారా?... దీనిపై పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
మరోవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఈరోజు ప్రజాపోరు పేరుతో ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే వైసీపీ ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. వైసీపీ ర్యాలీకి ప్రజలు ఎవరూ కూడా తరలిరావద్దని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత.. భక్తుల ఆగ్రహం
మూడు కోట్ల విలువైన వస్తువులు సీజ్.. విమానాశ్రయంలో కలకలం
Read Latest Telangana News And Telugu News