Kidney Racket: ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. సంచలన విషయాలు వెలుగులోకి...
ABN , Publish Date - Nov 12 , 2025 | 07:42 AM
మదనపల్లిలో కిడ్నీ రాకెట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతిచెందడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): మదనపల్లిలో కిడ్నీ రాకెట్ (Kidney Racket) గుట్టురట్టయింది. మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీల మార్పిడి గోల్‌మాల్ అయింది. కిడ్నీ ఇచ్చిన మహిళ యమున మృతిచెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త సూరిబాబు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఆస్పత్రిపై తనిఖీలు చేశారు మదనపల్లి పోలీసులు. ఈ కేసులో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
అన్నమయ్య జిల్లాకు చెందిన డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు కోడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మదనపల్లి డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాలు, పుంగనూరు డయాలసిస్ కేంద్రం మేనేజర్ వెంకటేశ్ నాయక్‌లు కూడా కిడ్నీ రాకెట్ వెనుక ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ముఠా ద్వారా కిడ్నీల మార్పిడికి డాక్టర్ శాశ్వతి ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ డయాలసిస్ సెంటర్‌కు వచ్చే ధనికులను డాక్టర్ శాశ్వతి గుర్తించి, డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా కిడ్నీలు మార్పిడి చేస్తామని నమ్మబలికి ఈ దందాకు తెరదీశారు. అలాగే, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొందరు బ్రోకర్లని నియమించి, కిడ్నీలు విక్రయించే పేదలను ఆకర్షించి వారిని మదనపల్లికి తీసుకొచ్చి.. ఎలాంటి అనుమతి లేకుండా కిడ్నీల మార్పిడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమున అనే పేద మహిళను కిడ్నీ రాకెట్ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేష్ కలిశారు. ఈ క్రమంలోనే కిడ్నీ ఇస్తే రూ.8 లక్షలు ఇస్తామని నమ్మబలికి యమునను మదనపల్లికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో నిన్న (మంగళవారం) ఉదయం యమునకు ఆపరేషన్ చేసి కిడ్నీని బయటకు తీశారు. కిడ్నీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. అదే సమయంలో యమున ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి మృతి చెందింది. ఆమె మృతిని గుట్టుచప్పుడు కాకుండా గ్లోబల్ ఆస్పత్రి నిర్వాహకులు దాచి పెట్టడానికి ప్రయత్నించారు. యమున మృతదేహాన్ని తిరుపతి మీదుగా విశాఖపట్నానికి తరలించండానికి ఏర్పాట్లు చేశారు. అయితే, యమున భర్త సూరిబాబుకు అనుమానం రావడంతో ఈ విషయంపై తిరుపతి పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.
తిరుపతి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లి టూ టౌన్ పోలీసులు, గ్లోబల్ ఆస్పత్రిపై తనిఖీ చేసి అక్కడే ఉన్న మదనపల్లి డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాలు, పుంగనూరు డయాలసిస్ కేంద్రం మేనేజర్ వెంకటేశ్ నాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు వైజాగ్‌కు చెందిన ముగ్గురు బ్రోకర్లు సత్య పద్మా వెంకటేశ్వర్లని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయంపై పోలీసుల సమగ్ర దర్యాప్తు చేస్తే మదనపల్లిలో జరుగుతున్న కిడ్నీ రాకెట్ అసలు గుట్టు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో కిడ్నీ రాకెట్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు.. మౌలానా ఆజాద్‌కి నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేష్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Read Latest AP News And Telugu News