Share News

AG Dammalapati Srinivas: హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్‌-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్‌

ABN , Publish Date - Nov 12 , 2025 | 06:09 AM

ఏపీపీఎస్సీ స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉన్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జవాబుపత్రాలు హాయ్‌ల్యాండ్‌కు తరలింపు నిర్ణయానికి సంబంధించి కమిషన్‌ వద్ద ఎలాంటి రికార్డులు లేవని అడ్వొకేట్‌ జనరల్‌....

AG Dammalapati Srinivas: హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్‌-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్‌

  • ఎవరి నిర్ణయంతో తరలించారో కూడా తెలీదు

  • హైకోర్టుకు అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి వెల్లడి

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉన్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జవాబుపత్రాలు హాయ్‌ల్యాండ్‌కు తరలింపు నిర్ణయానికి సంబంధించి కమిషన్‌ వద్ద ఎలాంటి రికార్డులు లేవని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. జవాబుపత్రాలను హాయ్‌ల్యాండ్‌కు తరలించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారనే విషయం పై కూడా ఎలాంటి వివరాలు లేవన్నారు. ఏపీపీఎస్సీ వద్ద ఉన్న రికార్డులను పరిశీలిస్తే జవాబుపత్రాలను 2021, డిసెంబరు 5న హాయ్‌ల్యాండ్‌కు తరలించారని, అక్కడ నుంచి తిరిగి 2022, ఫిబ్రవరి 26న ఏపీపీఎస్సీ కార్యాలయానికి తీసుకొచ్చారని వివరించారు. సొమ్ము చెల్లింపులకు సంబంధించి పలు చెక్కుల జిరాక్స్‌ కాపీలు ఉన్నాయని, ఆ సొమ్మును దేనికి ఖర్చు చేశారనే వివరాలు అందుబాటులో లేవన్నారు. 2022, మార్చి నుంచి మే వరకు 2 ప్రభుత్వ కళాశాలల వేదికగా జరిగిన మాన్యువల్‌ మూల్యాంకనం కోసం అదనంగా బార్‌కోడ్లు, ఓఎంఆర్‌ షీట్లు, కంట్రోల్‌ బండిల్స్‌ను ప్రింట్‌ చేయించారని తెలిపారు. అన్ని వివరాలను సీల్డ్‌ కవర్‌లో అదనపు అఫిడవిట్‌ రూపంలో కోర్టు ముందు ఉంచామన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జవాబుపత్రాలను సీల్డ్‌ కవర్‌లో రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు అప్పగించామని చెప్పారు. ఈ వివరాలను పరిశీలించిన ధర్మాసనం అదనపు అఫిడవిట్‌ దాఖలులో చట్టం నిర్దేశించిన విధానాన్ని అనుసరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వీయ ప్రమాణపత్రం జత చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. అదనపు అఫిడవిట్‌ను ఏపీపీఎస్సీ సెక్రెటరీ కాకుండా మరో అధికారి దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. ఇకనైనా పారదర్శకంగా వ్యవహరించాలని, ఏదైనా తప్పు జరిగితే అధికారులపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. పూర్తి వివరాలతో సమగ్ర అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.


ఏం జరిగిందంటే..

2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని గతంలో ఏకసభ్య ధర్మాసనం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో అర్హులుగా పేర్కొంటూ 2022, మే 26న ఏపీపీఎస్సీ ఇచ్చిన జాబితాను రద్దు చేసింది. తాజాగా మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని ఎంపిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ 2024, మార్చి 13న న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ, నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ఇటీవల తుది విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, తీర్పు ప్రతి సిద్ధం చేస్తుండగా 2022, జూన్‌ 24న హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ ఉత్తర్వుల అమలులో లోపాలను గుర్తించిన ధర్మాసనం వాటిని నివృత్తి చేసుకొనేందుకు ఇటీవల అప్పీళ్లపై మరోసారి విచారణ ప్రారంభించింది.

Updated Date - Nov 12 , 2025 | 06:09 AM