Guntakal Railway Station : ఇంకా ఎన్నాళ్లకో...?
ABN , Publish Date - Mar 04 , 2025 | 12:35 AM
స్థానిక రైల్వే స్టేషనలో వివిధ ప్లాట్‌ఫాంల ట్రాక్ అనుసంధానం ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. గుంతకల్లు రైల్వే స్టేషనలో ఏడు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. అయితే రైల్వే స్టేషనలో అంతర్గతంగా ప్లాట్‌ఫాంల ట్రాక్ అనుసంధానం జరగని కారణంగా రైళ్ల వేళల్లో ఆలస్యం, గూడ్సు...

పూర్తి కాని ప్లాట్‌ఫాంల ట్రాక్ అనుసంధానం
రైళ్ల వేళల్లో ఆలస్యం, గూడ్సు రైళ్ల డిటెన్షన
గుంతకల్లు రైల్వే జంక్షనలో తొలగని సమస్యలు
గుంతకల్లు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వే స్టేషనలో వివిధ ప్లాట్‌ఫాంల ట్రాక్ అనుసంధానం ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. గుంతకల్లు రైల్వే స్టేషనలో ఏడు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. అయితే రైల్వే స్టేషనలో అంతర్గతంగా ప్లాట్‌ఫాంల ట్రాక్ అనుసంధానం జరగని కారణంగా రైళ్ల వేళల్లో ఆలస్యం, గూడ్సు రైళ్ల డిటెన్షన (నిలిపివేతకు) జరుగుతోంది. స్టేషనలోని 1, 2-3 ప్లాట్‌ఫాంలను 4-5, 5-7 ప్లాట్‌ఫాంలతో అనుసంధానించలేదు. ప్లాట్‌ఫాంలన్నింటినీ అనుసంధానించి.. ఒక ప్లాట్‌ఫాంలోకి వచ్చిన రైలును అటు చెన్నై, విజయవాడ వైపునకు, ఇటు గూళ్లపాళ్యం-కల్లూరు మీదుగా బెంగళూరు వైపునకు పంపడానికి అనువుగా మార్చే ప్రతిపాదన ఉంది. దాదాపు ఐదేళ్ల కిందట ప్రతిపాదనలు తయారుచేశారు. కిందటి సంవత్సరం బడ్జెట్టులో అనుమతులు కూడా ఇచ్చి అంచనాలు తయారు చేయడానికి నిధులు విడుదల చేశారు. కానీ నిర్మాణానికి అవసరమైన నిధులు మాత్రం ఇవ్వలేదు. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఇంతవరకూ పించ బుక్‌ను విడుదల
చేయకపోవడంతో గుంతకల్లు రైల్వే డివిజనలో చేయబోయే పనులకు ఏమాత్రం నిధులు లభించాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. అత్యంత అవసరమైన ఈ ప్లాట్‌ఫాంల అనుసంధాన కార్యక్రమం ఈ సంవత్సరమైనా పట్టాలెక్కుతుందో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
సమస్య ఇదీ..
గుంతకల్లు రైల్వే స్టేషనలో మొదటి మూడు ప్లాట్‌ఫాంల ట్రాక్ స్టేషనకు తూర్పు వైపున మిగతా నాలుగు ప్లాట్‌ఫాంల ట్రాక్‌తో అనుసంధానం జరగలేదు. ఈ కారణంగా హుబ్లీ, ముంబై వైపు నుంచి వచ్చే రైళ్లను 1, 2-3 ప్లాట్‌ఫాంలలోకి తీసుకు వస్తే.. అక్కడి నుంచి నేరుగా చెన్నై, విజయవాడ మార్గాలలోకి తీసుకెళ్లడానికి సాధ్యపడదు. గతంలో కల్లూరు-గూళ్లపాళ్యం మీదుగా వచ్చే రైళ్లను విజయవాడ వైపు నడపడానికి ఇబ్బందులు ఏర్పడేవి. కానీ ముంబై-విజయవాడ లైన్లకు బైపాస్ నిర్మించడంతో ఉపశమనం కలిగింది. కానీ ప్లాట్‌ఫాంల అనుసంధానం జరగని కారణంగా సమస్య పూర్తిగా తొలగలేదు. 1, 2-3 ప్లాట్‌ఫాంల ట్రాక్‌ను ఇతర లైన్లతో కలపకపోతే రైళ్లకు సకాలంలో ప్లాట్‌ఫాంలు ఖాళీలు లభించవు. ముంబై, హుబ్లీ వైపు నుంచి వచ్చే రైళ్లను చెన్నై, విజయవాడ వైపు పంపాలనుకుంటే మొదటి మూడు ప్లాట్‌ఫాంలు ఖాళీగా ఉన్నా కూడా వాటిలోకి తీసుకెళ్లలేరు. ఈ రైళ్లకు 4, 5, 6, 7 ప్లాట్‌ఫాంలలో ఖాళీ లేకపోతే ముందు స్టేషనలోనో, ఔటర్‌లోనో నిలిపివేయవలసి ఉంటుంది. అలాగే గూడ్సు రైళ్లకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతున్నందున పక్క స్టేషన్లలో డిటెన్షన చేస్తున్నారు.
పరిష్కారానికి అవకాశం ఇలా..
గుంతకల్లు రైల్వే స్టేషన పాత భవనం కారణంగా 1, 2, 3 ప్లాట్‌ఫాంల అనుసంధా నానికి 70 ఏళ్లుగా ఆటంకం ఏర్పడుతూ వచ్చింది. 1, 2, 3 ప్లాట్‌ఫాంల ట్రాక్‌కు, 4, 5, 6, 7 ప్లాట్‌ఫాంల ట్రాక్‌కు మధ్యన పాత రైల్వే స్టేషన భవనం ఉండేది. ఏడేళ్ల కిందట స్టేషనకు తూర్పున ఉన్న పాత భవనాన్ని వినియోగించడం ఆపేసి, దక్షిణం వైపున కొత్త భవనాన్ని వినియోగంలోకి తెచ్చారు. దీంతో పాత భవనాన్ని ట్విన లైన క్వార్టర్సును తొలగించి 1, 2, 3 ప్లాట్‌ఫాంల లైన్లను నిర్మించి ఇతర లైన్లకు అనుసంధానం చేసే వీలు కలిగింది. కొత్త భవనాన్ని ఏడేళ్ల కిందట ప్రారంభించినా ఇంత వరకూ పాత భవనాన్ని తొలగించలేదు. గడచిన ఏడేళ్ల కాలంలో గుంతకల్లు రైల్వే స్టేషనలో ప్రయాణ రైళ్లు, సరుకు రవాణా రైళ్ల ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. రైళ్ల వేగాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గుంతకల్లు రైల్వే స్టేషనలోని అన్ని లైన్లను అనుసంధానిస్తూ బైపాస్ లైన్లను నిర్మించాల్సి ఉంది. కేవలం హుబ్లీ-ముంబై, ముంబై-విజయవాడ లైన్లను అను సంధానిస్తూ రెండు బైపాస్ లైన్లను నిర్మించారు. ప్రస్తుతం హుబ్లీ-విజయవాడ లైన్లను కలుపుతూ ఇంకో బైపాస్ లైనను నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా ఇతర లైన్లకు బైపాస్ లైన్లను ఏర్పాటు చేసే విషయంగా చర్యలేవీ చేపట్టలేదు. అటువంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రైల్వే స్టేషనలో అంతర్గతంగా ప్లాట్‌ఫాంల లైన్లు అనుసంధానించడానికే జాగు ఏర్పడుతుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రానున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేటాయింపులను తెలిపే పింక్ బుక్ రాకపోయినా రైల్వే స్టేషనలోని లైన్ల అనుసంధానానికి సంబంధించిన పనికి నిధులు తప్పక వస్తాయని, ఆ పనులు చేపడతామని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా తెలియజేయడం గమనార్హం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....