డ్వామాలో డ్రామా
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:47 AM
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో పెద్ద హైడ్రామా సాగుతోంది. విడపనకల్లు మండలంలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడినా.. బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. అక్రమాలు బయటపడినపుడు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. అధికారులే.. తర్వాత ఉన్నఫలంగా వద్దంటూ ఉత్తర్వులిచ్చారట. పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినా కనీసం...

విడపనకల్లు మండలంలో వింతలు
సొమ్ము స్వాహా చేసిన సిబ్బందిపై ప్రేమ
తొలుత క్రిమినల్ చర్యలకు ఆదేశాలు
ఉన్నఫలంగా ఆపేయాలంటూ ఉత్తర్వులు
రికవరీ మాటున మాయలు
సస్పెండ్ చేయకున్నా 20 రోజులుపైగా సిబ్బంది గైర్హాజరు
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో పెద్ద హైడ్రామా సాగుతోంది. విడపనకల్లు మండలంలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడినా.. బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. అక్రమాలు బయటపడినపుడు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. అధికారులే.. తర్వాత ఉన్నఫలంగా వద్దంటూ ఉత్తర్వులిచ్చారట. పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినా కనీసం సప్పెండ్ చేసిన పాపాన పోలేదు. ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా.. ఎనిమిది మంది సిబ్బంది 20 రోజులుగా విధులకు గైర్హాజరవుతుండడం శోచనీయం. వారు సెలవు పెట్టారా, అనుమతి తీసుకున్నారా.. అన్నది కూడా అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారంటే ఎంత ఇష్టారాజ్యంగా వ్యవహారాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
-ఆంధ్రజ్యోతి, విడపనకల్లు
రూ.1.5 కోటి స్వాహా
ఉపాధి హామీ పనుల్లో నకిలీ జాబ్ కార్డులు తయారు చేసి రూ.1.5 కోట్లు కాజేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులే తిరిగి క్రిమినల్ చర్యలు చేపట్ట వద్దు అంటూ ఆదేశాలు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. మండలంలోని వివిధ గ్రామాల్లో 2023-2024 ఏడాదిలో రూ.11 కోట్లకుపైగా ఉపాధి హామీ పనులు చేపట్టారు. ఈ పనుల్లో కంప్యూటర్ ఆపరేటర్ (సీఓ) సుభాన, ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి నకిలీ జాబ్ కార్డులను తయారు చేసినట్లు సామాజిక తనీఖీలో బయట పడింది. మండలంలోనే లేనివారి పేర్లను జాబ్‌కార్డుల్లో ఎక్కించి, ఫీనో అకౌంట్ ఏర్పాటు చేసి దాదాపు రూ.1.5 కోటి స్వాహా చేశారు. దీనిపై సామాజిక తనిఖీ అధికారులు రికార్డులతో సహా అవినీతి జరిగినట్లు నిరూపించారు. జిల్లా అధికారులు రెండు నెలల తరువాత స్పందించి
ఈనెల 8వ తేదీన అవినీతి సిబ్బందిపై క్రిమినల్ చర్యలు చేపట్టారు. విడపనకల్లు పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది అవినీతి సొమ్మును కొంత తిరిగి చెల్లించారు.
చర్యలు నిలిపి వేయాలంటూ..
ప్రభుత్వోద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే చట్టపరంగా విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. కొంతమందిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తారు. మండలానికి చెందిన ఉపాధి హామీ సిబ్బంది రూ.కోట్లలో అవినీతికి పాల్పడినా.. జిల్లా అధికారులు వారిపై ప్రేమ చూపుతున్నారు. అవినీతి సొమ్ములో కొంత చెల్లించడంతో వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టవద్దు అంటూ జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఎంపీడీఓ షకీలా బేగం తెలిపారు.
బెదిరించేందుకేనా?
జిల్లా అధికారులు తలచుకుంటే ఏదైనా చేయగలరు అని మండలానికి చెందిన అవినీతి అధికారులపై వారు చూపిస్తున్న ప్రేమే నిదర్శనం. బోగస్ జాబ్ కార్డులతో రూ.కోట్లు అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టకుండా కేవలం రూ.18 లక్షలు అవినీతి జరిగిందంటూ రికవరికీ ఆదేశించారు. అందులో కొంత సొమ్ము చెల్లించిన వారిపై తదుపరి చర్యలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీలో ఎంత అవినీతి చేసినా అడిగేవారు ఉండరనీ, బయట పడితే ఎంతో కొంత చెల్లించి తిరిగి సంపాదించేకోవచ్చు అనే నమ్మకంతో సిబ్బంది బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సిబ్బంది ఏమైనట్లు..?
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధి హామీ సిబ్బంది 20 రోజులుపైగా విధులకు హాజరు కావటం లేదు. సస్పెండ్ చేయకున్నా వారు విధులకు హాజరు కాకుండా తిరుగుతున్నారు. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వీరిపై ఏం చర్యలు తీసుకున్నారన్నది రహస్యమే. పాల్తూరు గ్రామంలోనే జగనన్న ఇళ్లలో రూ.7.5లక్షలు, ఒకరి ఖాతా నుంచి మరొకరికి, గ్రామంలోనే లేనివారి ఖాతాల్లోకి జమ చేశారు. అమెరికా, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఇక్కడ పనులు చేసినట్లు రికార్డులు సృష్టించిన ఘనత విడపనకల్లు ఉపాధి హామీ సిబ్బందికే దక్కుతుంది. పాల్తూరులో రూ.28లక్షలు, డొనేకల్లు-ఆర్ కొట్టాల దారికి రూ.32 లక్షలు మండలం మొత్తం రూ.1.5 కోట్లు దుర్వినియోగం చేయగా.. రూ.18లక్షలు మాత్రమే అక్రమాలకు పాల్పడినట్లు తేల్చడాన్ని బట్టి చూస్తే మండల సిబ్బందికి జిల్లా అధికారులు ఎంతగా సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సిబ్బందిపై చర్యలు తీసుకుంటారా, రూ.18లక్షలు మాత్రం రికవరీ చేసి చేతులు దులుపుకుంటారో వేచి చూడాలి.
ఎవ్వరినీ సస్పెండ్ చేయలేదు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు తనకు ఉత్తర్వులు రాలేదు. పోలీసు స్టేషనలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ఇచ్చాం. ఆ మేరకు కేసు నమోదైంది. కొంత అవినీతి సొమ్మను సిబ్బంది చె ల్లించడంతో జిల్లా అధికారులు క్రిమినల్ చర్యలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. 8 మంది సిబ్బంది 20 రోజుల నుంచి విధులకు హాజరు కావటం లేదు.
-షకీలా బేగం, ఎంపీడీఓ, విడపనకల్లు
మరిన్ని అనంతపురం వార్తల కోసం....