Share News

క్రికెటర్లలో నాకు ఎవరూ ఫ్రెండ్స్ లేరు.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన అర్జున్ టెండూల్కర్

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:08 PM

తన వ్యక్తిగత జీవితం గురించి అర్జున్ టెండూల్కర్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అతడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నుంచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే.

క్రికెటర్లలో నాకు ఎవరూ ఫ్రెండ్స్ లేరు.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన అర్జున్ టెండూల్కర్
Arjun Tendulkar

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడిగా కెరీర్ ప్రారంభించాడు ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్. కానీ తొలి మ్యాచ్ నుంచే ఎన్నో ట్రోల్స్, విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు కాదంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటార. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితం గురించి అర్జున్ టెండూల్కర్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నుంచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అర్జున్.. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు.


‘నాకు క్రికెటర్లలో స్నేహితులు అంటూ ఎవరూ లేరు. నాకున్న ఫ్రెండ్స్‌ల్లో చాలా మందికి క్రికెట్ అంటేనే పెద్దగా తెలియదు. వారితో నేను ఎప్పుడూ క్రికెట్ గురించి మాట్లాడను. నాపైన ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. కానీ అవన్నీ నేను పట్టించుకోను. మనసు ప్రశాంతంగా ఉండేందుకు నాకో ప్రత్యేక మార్గం ఉంది. గోవాలో నాకు ఐదు కుక్కలు ఉన్నాయి. వాటితో గడపడం అంటే నాకు చాలా ఇష్టం. వాటితో ఉంటే నాకు సమయమే తెలియదు’ అని అర్జున్ వెల్లడించాడు.


ట్రోలింగ్‌పై..

సచిన్ టెండూల్కర్ వారసుడిగా ఉండటంతో అర్జున్‌పై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. దీనివల్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వస్తుంటాయి. దీనిపై అర్జున్ ఘాటుగా స్పందించాడు. ‘విమర్శలంటే నాకు భయం లేదు. ఏదీ ఏమీ జరిగినా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను’ అని చెప్పాడు. కాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో బుమ్రా, బౌల్ట్ వంటి స్టార్ బౌలర్ల మధ్య అర్జున్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇప్పుడు లఖ్‌నవూలో షమీ, మయాంక్ యాదవ్ వంటి వారితో పోటీ పడుతూ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు.


నాకు ఆదర్శం అతడే..

తన తండ్రి సచిన్ టెండూల్కర్‌ను కాకుండా ఇతర క్రికెటర్లలో ఎవరంటే ఎక్కువ ఇష్టమని అడగ్గా.. ఠక్కున యువరాజ్ సింగ్ పేరు చెప్పేశాడు అర్జున్. ‘యువరాజ్ సింగ్ స్పిన్నర్.. నేను పేసర్. అయినా నాకు యువీ అంటే చాలా ఇష్టం’ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. లఖ్‌నవూ టీమ్‌లో అర్జున్ బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

రిటైర్‌మెంట్ దిశగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి.. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతాడా?

ఇప్పుడు బానే ఉన్నా.. తన గాయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్!

Updated Date - Apr 01 , 2026 | 01:08 PM