విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. ఇంధన ధర రెట్టింపు
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:15 PM
ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సతమతమవుతోన్న విమానయాన సంస్థలపై ఇప్పుడు ఇంధన భారం పడింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధర ఆకాశన్నంటింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధ ప్రభావం ముడి చమురుపై తీవ్ర ప్రభావం చూపింది. అలానే ఈ ఉద్రిక్తతలతో సతమతమవుతోన్న విమానయాన సంస్థలపై ఇప్పుడు ఇంధన భారం పడింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధర నింగివైపు దూసుకెళ్లోంది. రికార్డు స్థాయిలో పెరిగి తొలిసారి రూ.2 లక్షల మార్క్ దాటింది. ఈ ప్రభావం విమాన టికెట్ల (Airfares)పై పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
సాధారణంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి. అలా ఇవాళ ఏప్రిల్ 1వ తేది కావడంతో ఏటీఎఫ్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. తాజాగా కిలో లీటర్ ఏటీఎఫ్ ధర ఏకంగా రూ.1,10,703 పెరిగి దేశ రాజధాని ఢిల్లీలో రూ.2,07,341కు చేరింది. గతంలో కిలో లీటర్ ధర రూ.96,638 ఉండగా.. ఇప్పుడు దాదాపు 114.5 శాతం మేర పెరిగింది. అలానే కోల్కతాలో రూ. 1,09,450, ముంబైలో రూ. 98,247, చెన్నైలో రూ. 1,09,873 గా ఏటీఎఫ్ ధరలు ఉన్నాయి.ఈ పెంపును పాక్షికంగా, దశలవారీగా మాత్రమే బదిలీ చేశామని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలానే దేశీయ విమానయాన సంస్థలకు ఈ పెంపు 8.5శాతం మాత్రమే వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది.
పెరిగిన ఏటీఎఫ్ ధరలపై విమానాయ సంస్థల నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. కానీ, ఈ ప్రభావం రానున్న రోజుల్లో విమాన టికెట్ల ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ లైన్ల నిర్వహణ వ్యయాల్లో 40శాతం ఇంధన ధరలకే వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన సర్వీసులను నడుపుతుండటం వల్ల తమపై అదనపు భారం పడుతోందని విమానాయ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. తాజాగా ఇంధన ధరను ఏకంగా డబుల్ చేయడంతో విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చులు భారీగా పెరగుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు టికెట్ల ధరలు పెంచడం వైపు ఎయిర్లైన్లు మొగ్గు చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు టికెట్లపై ఫ్యూయెల్ సర్ ఛార్జీలను విధించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్
మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈ సారి ఏకంగా రూ. 195