Share News

మీకూ 'రైతు భరోసా'.. డబ్బులు!

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:11 PM

కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని, ఇక మీదట కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయనున్నారు.

మీకూ 'రైతు భరోసా'.. డబ్బులు!
Rythu Bharosa Telangana 2026

ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రేవంత్ సర్కార్ భారీ ఊరటనిచ్చింది. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని, కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

62 వేల మంది కొత్త రైతులకు లబ్ధి:

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా పొందిన సుమారు 85 వేల మంది రైతులు ఉన్నారని అంచనా వేయగా, వారిలో ఇప్పటికే 62 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను వ్యవసాయ శాఖ ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రైతుల అర్హత, భూమి వివరాలు, పట్టాదారుల నిజానిజాలను నిర్ధారించిన తర్వాత వారం, పది రోజుల్లో తుది జాబితాను సిద్ధం చేయనున్నారు.


నిధుల జమ ఎప్పుడంటే..?

అర్హులుగా తేలిన కొత్త రైతులకు ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీల మధ్య యాసంగి (రబీ) రెండో విడత రైతు భరోసా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సీజన్‌లో సుమారు రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్‌లో లబ్ధి పొందిన ప్రతి రైతుకు, ఈ యాసంగిలో కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందనుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో సుమారు 69.39 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున మొత్తం రూ. 8,744.13 కోట్లను కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే పంపిణీ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది.

జిల్లాల వారీగా లబ్ధిదారులు:

రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో నల్లగొండ జిల్లా 5.22 లక్షల మందితో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి (3.53 లక్షలు), ఖమ్మం (3.35 లక్షలు), సిద్ధిపేట (3.18 లక్షలు) జిల్లాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు.. వీడియో షేర్ చేసిన ట్రంప్..

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన సంచలన ప్రణాళిక

Updated Date - Apr 01 , 2026 | 12:37 PM