దారుణం.. రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్లిన మహిళను..
ABN , Publish Date - Apr 01 , 2026 | 08:22 AM
సెల్‌ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్లిన మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమెను లైంగికంగా వేధించారు. మొబైల్ టెక్నీషియన్‌తో ఆమె ఎఫైర్ పెట్టుకుందన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్లిన మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమెను లైంగికంగా వేధించారు. మొబైల్ టెక్నీషియన్‌తో ఆమె ఎఫైర్ పెట్టుకుందన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నలంద జిల్లాలోని అజయ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ సెల్‌ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి స్థానికంగా ఉండే షాపునకు వెళ్లింది. మొబైల్ రిపేర్ టెక్నీషియన్‌తో ఆమెను చూసిన స్థానికులు కొందరు ఆగ్రహానికి గురయ్యారు.
మొబైల్ రిపేర్ టెక్నీషియన్‌తో ఆమెకు ఎఫైర్ ఉందన్న అనుమానంతో రెచ్చిపోయి ప్రవర్తించారు. ఇద్దరూ షాపులో ఉండగానే బయటినుంచి తాళం వేశారు. ఆ మహిళ కిటికీ నుంచి బయటకు దూకి, అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే జనం ఆమె జుట్టు పట్టుకుని వీధుల్లో ఈడ్చుకెళ్లారు. ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశారు. బలవంతంగా ఆమె నుదుటిపై సిందూరం పెట్టి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వారిని ప్రాధేయపడినా కనికరించలేదు. లైంగికంగా ఆమెను వేధించారు.
అతి కష్టం మీద ఆ బాధితురాలు వారినుంచి తప్పించుకుంది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళపై దాడికి పాల్పడ్డ వారిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మిగిలిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. కాగా, బాధిత మహిళ తన ముగ్గురు పిల్లలు, అత్తతో కలిసి గ్రామంలో నివాసం ఉంటోంది. భర్త పుణెలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. భార్యపై దాడి జరిగిన సంగతి తెలియగానే హుటాహుటిన ఇంటికి వచ్చేశాడు.
ఇవి కూడా చదవండి
నేటి నుంచి తొలి దశ ‘జనగణన 2027’..
ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయండి