Share News

సీఎం చంద్రబాబు కృషి వల్లే.. లోక్‌‌సభలో బిల్లు ఆమోదం: మంత్రి నారాయణ

ABN , Publish Date - Apr 01 , 2026 | 03:00 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషి వల్లే రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభలో ఆమోదం పొందిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.

సీఎం చంద్రబాబు కృషి వల్లే.. లోక్‌‌సభలో బిల్లు ఆమోదం: మంత్రి నారాయణ

అమ‌రావ‌తి, ఏప్రిల్1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషి వల్లే రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభలో ఆమోదం పొందిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. అమరావతి రైతుల తరఫున సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినందుకు ప్రధాని మోదీకి సైతం ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం రాజధాని బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంతో అమరావతిలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమ‌రావ‌తిపై పోరాడి విజ‌యం సాధించిన రైతుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.


అమ‌రావ‌తి అజేయం..

అమ‌రావ‌తికి అండ‌గా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరునా మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తి అజేయం.. ఇక‌పై ఎవ్వరూ ఒక్క ఇంచు కూడా అమ‌రావతిని క‌ద‌ల్చలేరని ధీమా వ్యక్తం చేశారు. అమ‌రావ‌తితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు.


ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు: మంత్రి ఆనం

గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా ఐదేళ్లపాటు మూడు ముక్కలాట ఆడిందంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాష్ట్ర రాజధానిగా శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు.


ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తూ..

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 14 వేల ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి ఆనం వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో కొలువుదీరిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన క్రమం తప్పకుండా పెన్షన్ పంపిణీ చేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ లబ్ధిదారులకు నెలకు రూ.4 వేల చొప్పున నగదు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.


జగన్‌కి బుద్ధి చెప్పాలి?: మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దొంగ నాటకాలను గుర్తించి.. తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. లోక్‌సభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో బుధవారం మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతిని రాష్ట్ర ప్రజలంతా ఆమోదించారన్నారు. 33 వేల ఎకరాల భూములను రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. ఆనాడు జగన్ అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మేము అనుకూలమని ప్రకటించారని గుర్తు చేశారు.


చాలా నేరాలు.. ఘోరాలు..

ప్రధాని మోదీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని కొల్లు రవీంద్ర తెలిపారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ చాలా ఘోరాలు, పాపాలు చేశారని వివరించారు. భూములు ఇచ్చిన రైతులు, మహిళలపై లాఠీఛార్జి చేయించారన్నారు. వారిపై అక్రమంగా కేసులు సైతం పెట్టించి జైలుకు పంపించారని చెప్పారు. చివరకు ఆ ప్రాంతంలో పరదాలు కట్టుకుని జగన్ వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. న్యాయస్థానం టూ దేవస్థానం అని మహిళలు చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని గుర్తు చేశారు. ఐదేళ్లలో అడుగు పని కూడా చేయకుండా జగన్.. అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి మండిపడ్డారు.


వైసీపీ నేతల కుట్రలు, వ్యాఖ్యలు దుర్మార్గం..

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతమైన అమరావతి ఆవిష్కృతమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉండేలా కట్టుదిట్టమైన చట్టం అవుతుందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుందని చెప్పారు. వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలు, వారు చేసే వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని మంత్రి రవీంద్ర తెలిపారు.


ఇప్పుడెలా ప్రశ్నిస్తారు జగన్..

అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొని అభ్యంతరాలు ఎందుకు చెప్పలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను మంత్రి కొల్లు రవీంద్ర సూటిగా ప్రశ్నించారు. మళ్లీ నేడు అమరావతిపై విషం చిమ్మేందుకు వైఎస్ జగన్ యత్నించారని విమర్శించారు. ఐదేళ్ల పాటు గడ్డి పీకాడా?.. ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తారంటూ వైఎస్ జగన్‌పై ఆయన నిప్పులు చెరిగారు. కేంద్రం అందిస్తున్న సహకారంతో సీఎం చంద్రబాబు అమరావతిలో అభివృద్ది పనులు చేస్తున్నారని వివరించారు. కేసుల భయంతో గత ఐదేళ్లుగా కేంద్రాన్ని నిధులు కూడా అడగలేక పోయారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మీకూ 'రైతు భరోసా'.. డబ్బులు!

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

For More AP News And Telugu News

Updated Date - Apr 01 , 2026 | 04:15 PM