ఏపీలో కాంగ్రెస్ కార్యాలయాలపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి.. తీవ్ర ఉద్రిక్తత
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:44 PM
ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ సమ్మిట్’పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. బీజేపీ యువమోర్చా (BJYM) శ్రేణులు గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశాయి. వివరాల్లోకి వెళితే..
అమరావతి: ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీ(Delhi) వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ సమ్మిట్’పై రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని మోదీని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఉద్రిక్తతకు దారితీశాయి. అయితే, రాహుల్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఏపీలోని పలు జిల్లాల్లో బీజేపీ యువమోర్చా (BJYM) శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగాయి. గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ కార్యాలయంపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు బీజేపీ(BJP) కార్యకర్తలు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీపై దాడి చేశారు. ప్రతిగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసు కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై మస్తాన్ వలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పార్టీ ఆఫీస్‌లపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తారా..? మేం తిరిగి దాడులకు తెగబడిన ఒక్క బీజేపీ కార్యకర్త కూడా మిగలడంటూ' ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు కర్నూలు(Kurnool) జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోడిగుడ్లు, టమోటాలతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై BJYM రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, అనుచరులు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గేటు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చింపేశారు. దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విజయనగరం జిల్లా(Vizianagaram District)లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతోపాటు పార్టీ కార్యాలయం బోర్డు దగ్ధం చేశారు. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మెడికల్ పీజీ కోర్సులకు లైన్ క్లియర్
Read Latest Telangana News and National News