Sangareddy: ప్రేమోన్మాది కిరాతకం
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:04 AM
ప్రేమ త్యాగం కోరుతుంది.. తన ఇష్టసఖి బాగుండాలని ప్రేమికులు కోరుకుంటారు.. కానీ, చదువైపోయిన తర్వాతే పెళ్లి సంగతి ఆలోచిస్తానని చెప్పిన ప్రేమికురాలి గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన..

యువతి మెడకోసి హత్య
ఘటనాస్థలంలోనే యువతి మృతి
తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం
పెళ్లి నిరాకరించినందుకే ఘాతుకం
ఆరు నెలల క్రితం ప్రవీణ్‌ను హెచ్చరించిన రమ్య తల్లిదండ్రులు
రామచంద్రాపురం టౌన్, జూలై 7 (ఆంధ్ర జ్యోతి): ప్రేమ త్యాగం కోరుతుంది.. తన ఇష్టసఖి బాగుండాలని ప్రేమికులు కోరుకుంటారు.. కానీ, చదువైపోయిన తర్వాతే పెళ్లి సంగతి ఆలోచిస్తానని చెప్పిన ప్రేమికురాలి గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంత వాసి బొత్స శ్రీనివాసరావు 25 ఏళ్ల క్రితమే పటాన్‌చెరుకు వలస వచ్చి బండ్లగూడ గ్రామంలో నివసిస్తున్న శ్రీనివాసరావు, ఆయన భార్య ఈశ్వరమ్మ ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నారు. చందానగర్ ప్రగతి కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వారి కూతురు రమ్య (23), పటాన్‌చెరులో ఉంటూ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న మెదక్‌జిల్లా మన్నేపల్లి వాసి ప్రవీణ్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం రమ్య తల్లిదండ్రులు ఇంట్లో లేరని నిర్ధారించుకున్న ప్రవీణ్.. లోపలికెళ్లి పెళ్లి చేసుకోమని అడిగాడు.
చదువు పూర్తయ్యాక పెళ్లి సంగతి ఆలోచిస్తానని ఆమె చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వా దం చోటు చేసుకున్నది. ప్రవీణ్ ముందే వెంట తెచ్చుకున్న కత్తితో రమ్య గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. అదే సమయంలో ఇంటికొచ్చిన తల్లి ఈశ్వరమ్మ గేటు లోపలి నుంచి తాళం వేసి ఉండటంతో చాలా సేపు పిలిచినా జవాబు రాకపోవడంతో భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆయన ఇంటి వద్దకొచ్చి గోడ దూకి లోపలికెళ్లి చూడగా, గదిలో మంచంపై రమ్య, ప్రవీణ్ రక్తపు మడుగులో ఉన్నారు. రమ్య అప్పటికే మరణించగా, కొన ఊపిరితో ఉన్న ప్రవీణ్‌ను స్థానికులు 108 అంబులెన్సులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. రమ్య తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆరు నెలల క్రితం రమ్య తల్లిదండ్రులను కలిసిన ప్రవీణ్ ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు. కానీ, తమ కూతురు వైపు మళ్లీ చూస్తే బాగుండదని వారు హెచ్చరించి పంపారు. అటుపై రమ్యకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రవీణ్.. ఆమెతో ఘర్షణకు దిగి.. హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.