Gachibowli Forest Land: అది అటవీ భూమి కానేకాదు
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:19 AM
కంచ గచ్చిబౌలి ప్రాంతం ఎట్టిపరిస్థితుల్లోనూ అటవీ భూమి కానేకాదని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ భూములను కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) నివేదికలో అటవీ భూమిగా ప్రస్తావించడం సరికాదని.. తప్పుడు అంచనాల ప్రాతిపదికపై ఆ నిర్ధారణకు వచ్చిందని వివరించింది.

కేంద్ర సాధికారిక కమిటీ తప్పుడు అంచనాలతో ఆ నిర్ధారణకు వచ్చింది
ఏ చట్టం ప్రకారమైనా కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని అటవీ భూమిగా వర్గీకరించలేం
గతంలో సుప్రీం తీర్పు ఇదే చెప్పింది
సుప్రీంకోర్టుకు తాజాగా సమర్పించిన సమగ్ర అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి
అఫిడవిట్‌పై స్పందించేందుకు సమయం కోరిన అమికస్ క్యూరీ
తదుపరి విచారణ 13వ తేదీకి వాయిదా
న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి ప్రాంతం ఎట్టిపరిస్థితుల్లోనూ అటవీ భూమి కానేకాదని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ భూములను కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) నివేదికలో అటవీ భూమిగా ప్రస్తావించడం సరికాదని.. తప్పుడు అంచనాల ప్రాతిపదికపై ఆ నిర్ధారణకు వచ్చిందని వివరించింది. ఏ చట్టాల ప్రకారం చూసినా ఆ ప్రాంతాన్ని అటవీ భూమిగా వర్గీకరించడానికి వీల్లేదని.. గతంలోని సుప్రీం తీర్పు కూడా ఇదే విషయాన్ని సమర్థిస్తోందని సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో సుమోటో కేసుతోపాటు ఇతరుల పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలో జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశానుసారం సీఎస్ రామకృష్ణారావు మంగళవారమే సమగ్ర అంశాలు, చిత్రాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అఫిడవిట్‌పై స్పందించేందుకు కొంత సమయం కావాలని అమికస్ క్యూరీ పరమేశ్వర్, సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు కోరారు. దీనితో ధర్మాసనం విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. అనంతరం సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతానికైతే అక్కడ అటవీ భూమిని పరిరక్షించారు కదా?’ అని ప్రశ్నించారు. అభిషేక్ సింఘ్వి జోక్యం చేసుకొని.. అది అటవీ భూమి కాదని, ఈ అంశంపైనే విచారణ జరగాల్సి ఉందని వివరించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ ‘‘అది ఏ భూమి అయినా అక్కడ చెట్ల నరికివేత ఆగిపోయింది కదా? నేను కూడా సుస్థిర అభివృద్ధిని కాంక్షిస్తాను. స్థిరమైన అభివృద్ధి ముఖ్యమే.. కానీ రాత్రికి రాత్రి 30 బుల్డోజర్లు తెచ్చి చెట్లను కూల్చివేయడం సమంజసం కాదు’’ అని పేర్కొన్నారు.
అభివృద్ధికి ఆ భూమి కీలకం
హైదరాబాద్ మహానగర పరిధిలో కంచ గచ్చిబౌలి భూమి అత్యంత కీలకమని సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘‘గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇతర ఐటీ కారిడార్లలో అభివృద్ధి తారస్థాయికి చేరుకున్నందు వల్ల ప్రస్తుత భూమి మౌలిక సదుపాయాలు ఏర్పరిచేందుకు, కొత్త టెక్నాలజీ క్యాంప్‌సలను నిర్మించేందుకు అవసరం. దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. 2007 నుంచి 2014 మధ్య కోర్టుల్లో కేసుల నేపథ్యంలో కంచ గచ్చిబౌలి ప్రాంతంలో చెట్లు, మొక్కలు, పొదలు పెరిగాయి. అంత మాత్రాన దాన్ని అడవిగా భావించవద్దు. అసలు కంచ అంటే సాగుచేయని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూమి అని అర్థం. అది అటవీ భూమి కాదనేందుకు ఇదొక న్యాయపరమైన సూచిక. 2001 అక్టోబర్ 29న జారీ అయిన జీవో 538 ప్రకారం ఈ భూమిని ప్రజా అవసరాల కోసం అభివృద్ధి చేసేందుకు నోటిఫై చేశారు. 2006, 2024లో సేకరించిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం చూసినా అది అటవీ భూమి కాదన్న విషయం స్పష్టం అవుతోంది. అయినా చెట్ల సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకున్నాం. కూల్చిన చెట్లకు బదులుగా సాధ్యమైన చోటల్లా తిరిగి నాటుతున్నాం’’ అని వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News