Fee Regulation: ప్రైవేటు బడులు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ
ABN , Publish Date - May 13 , 2025 | 03:51 AM
డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉన్నవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, జూనియర్ కళాశాలలకు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సూచనలతో ఫీజు నియంత్రణపై ప్రభుత్వం ముసాయిదా చట్టం సిద్ధం చేసింది.

పేరెంట్స్, టీచర్స్ కమిటీలే వాటిని నిర్ణయించాలి
జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ప్రతీ స్కూల్లో పేదలకు 25ు ఫ్రీ సీట్లు
విద్యారంగ సంస్కరణలపై సిద్ధమైన ముసాయిదా చట్టం
మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ
పాల్గొన్న పాఠశాలలు, కళాశాలల యాజమాన్య సంఘాలు
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి) : డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉన్నవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, జూనియర్ కళాశాలలకు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సూచనలతో ఫీజు నియంత్రణపై ప్రభుత్వం ముసాయిదా చట్టం సిద్ధం చేసింది. విద్యారంగంలో సంస్కరణలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన సోమవారం జరిగింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, డిగ్రీ విద్య కార్యదర్శి శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్య సంచాలకులు ఈవీ.నరసింహారెడ్డితోపాటు ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం సిద్ధం చేసిన ముసాయిదా చట్టాన్ని ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్ కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధులకు అందించారు. ప్రతీ ప్రైవేటు పాఠశాల, కళాశాలలో 10 మందితో కూడిన పేరెంట్స్, టీచర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. ఇందులో ఐదుగురు పేరెంట్స్, నలుగురు టీచర్లు, ఒకరు కళాశాల యాజమాన్యం తరఫున ఉంటారు. ఫీజులను ప్రతీ రెండేళ్లకోసారి ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ నిర్ణయించిన ఫీజులను జిల్లాస్థాయిలో కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా ఖజానా అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఖరారు చేస్తుంది.
అలాగే రాష్ట్రస్థాయి త్రిసభ్య కమిటీలో రిటైర్డ్ న్యాయమూర్తి, ఆడిటర్, విద్యాశాఖలో జేడీ స్థాయి అధికారి ఉంటారని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్నవిధంగా ప్రతీ ప్రైవేటు పాఠశాల మొత్తం సీట్లలో నాలుగోవంతు(25 శాతం) పేదలకు ఉచితంగా కేటాయించాలి. ఈ ఉచిత సీట్ల కోసం తల్లిదండ్రులు ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తే ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. వీటికి సంబంఽధించి ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని పేర్కొన్నారు. కాగా ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఇదే తరహాలో ఫీజు నియంత్రణ ఉండాలని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై సమావేశంలో పాల్గొన్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రలోభపెట్టే కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల తప్పుడు ప్రకటనలను ప్రభుత్వం నియంత్రించాలని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) అధ్యక్షుడు మధుసూదన్, కార్యదర్శి రమేష్ రావు కోరారు. త్వరలో మరో సమావేశం నిర్వహించి చర్చించిన తర్వాత ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని శ్రీధర్ బాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News