High Court: నెమళ్ల అరుపులు.. జింకల పరుగులు.. అంతా ఉత్తదే
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:19 AM
కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వ్యవహారంలో కొన్ని దుష్ట శక్తులు పని గట్టుకుని తప్పుడు ప్రచారం సాగించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం.. హైకోర్టుకు తెలిపిన సర్కారు
కౌంటర్ దాఖలుకు రెవెన్యూ, అటవీ శాఖలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వ్యవహారంలో కొన్ని దుష్ట శక్తులు పని గట్టుకుని తప్పుడు ప్రచారం సాగించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. నెమళ్లు అరిచినట్లు.. జింకలు భయంతో పరిగెత్తినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంలో ఫేక్ వీడియోలు, ఫొటోలను సృష్టించి సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఇలా తప్పుడు ప్రచారం చేసిన వ్యవహారంపై నివేదిక సమర్పిస్తామని హైకోర్టుకు చెప్పింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల్లో చెట్ల నరికివేతను అడ్డుకోవాలని, టీజీఐఐసీకి భూబదలాయించే జీవో 54ను కొట్టేయాలని, అక్కడ నేషనల్ పార్క్ అభివృద్ధి చేయాలని కోరుతూ వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు, శాస్త్రవేత్తలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ యార రేణుక ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. వట ఫౌండేషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు ప్రారంభించారు.
చెట్ల నరికివేత వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిందని.. ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టబోతోందని తెలిపారు. వివాదాస్పద ప్రాంతాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని సెంట్రల్ ఎంపవర్ కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. పర్యావరణ అనుమతులు, పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుంది అని అధ్యయనం చేయడం వంటి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. వివాదాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఎదుట ఉన్న పిటిషన్‌లను వాయిదా వేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇంకా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని, సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని చేపట్టినందున హైకోర్టు ఎదుట ఉన్న పిటిషన్‌లను వాయిదా వేయాలని కోరారు.
రాష్ట్ర అటవీ శాఖ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొంత మంది తప్పుడు ప్రచారానికి తెర తీశారని, ఫేక్ వీడియోలు, ఫొటోలతో నెమళ్లు అరుస్తున్నట్లు.. జింకలు పరిగెత్తుతున్నట్లు తప్పుడు కథనాలు అల్లారని, దీనిపై ప్రభుత్వం తరఫున నివేదిక సమర్పిస్తామని తెలిపారు. అన్నివర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కౌంటర్‌లు, నివేదికలు దాఖలు చేయడానికి అన్ని శాఖలకు అనుమతిస్తున్నామని, రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖలు ఈ నెల 24 వరకు దాఖలు చేయాలని పేర్కొంది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఉన్న పిటిషన్లలోని డిమాండ్లతోనే కేఏ పాల్ తాజాగా మరో పిల్ దాఖలు చేశారు. సదరు భూమి అటవీప్రాంతానికి చెందినదని.. దాన్ని రూ.75 కోట్లకు ఎకరం చొప్పున వేలం వేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. పాల్ పిటిషన్‌ను మిగతా పిటిషన్లతో విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News