Share News

Railways: ‘రైల్వే బడ్జెట్‌’లో తెలంగాణకు 5,337కోట్లు

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:16 AM

కేంద్రబడ్జెట్‌లో రైల్వేకు సంబంధించి తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ కేటాయింపులు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రతీ ఏట కేటాయించినదాని కంటే 6 రెట్లు ఎక్కువని అన్నారు.

Railways: ‘రైల్వే బడ్జెట్‌’లో  తెలంగాణకు  5,337కోట్లు

  • గత పదేళ్లలో రూ.41,667కోట్లతో రాష్ట్రంలో రైల్వే సదుపాయాల అభివృద్ధి

  • 2014 నుంచి ఇప్పటి వరకు 753 కిలోమీటర్లలో కొత్త ట్రాకుల నిర్మాణం

  • ‘కాజీపేట్‌’ను మల్టీ పర్పస్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌గా అభివృద్ధి చేస్తాం

  • రూ.327కోట్లతో హైదరాబాద్‌, రూ.715కోట్లతో సికింద్రాబాద్‌

  • తెలంగాణలో 1,326కిలోమీటర్లలోకవచ్‌ వ్యవస్థ అందుబాటులోకి

  • రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కొత్తగా 200 వందే భారత్‌లు

  • కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కేంద్రబడ్జెట్‌లో రైల్వేకు సంబంధించి తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ కేటాయింపులు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రతీ ఏట కేటాయించినదాని కంటే 6 రెట్లు ఎక్కువని అన్నారు. యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీకి ఏటా సగటున రూ.886 కోట్లు మాత్రమే కేటాయించినట్లు తెలిపారు. సోమవారం, ఢిల్లీలోని రైల్వే భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో రైల్వే జోన్ల వారీగా చేసిన కేటాయింపుల గురించి వివరించారు. తెలంగాణలో గత పదేళ్లలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు రూ.41,677కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. 2014 నాటి నుంచి చూస్తే రాష్ట్రంలో 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాకులను నిర్మించినట్లు చెప్పారు. రైల్వే ట్రాకుల విద్యుదీకరణను 100ు పూర్తి చేసినట్లు తెలిపారు. కాజీపేట్‌లో చేపట్టిన రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను మల్టీపర్పస్‌ రైల్వే ప్రొడక్షన్‌ యూనిట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త రైళ్లను, కొత్త ప్రాజెక్టులను దశలవారీగా ప్రకటించేలా బడ్జెట్‌ పాలసీలో మార్పులు చేశామని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ను రూ.327 కోట్లు, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను రూ.715 కోట్లతో ఆధునీకస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే ఆరేళ్లలో దేశవ్యాప్తంగా కవచ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు 1,326 కిలోమీటర్ల మేర కవచ్‌ సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. మరో వెయ్యి కిలోమీటర్ల మేర అమలు చేయాల్సి ఉందన్నారు.


హైదరాబాద్‌-విజయవాడ మధ్య నమో భారత్‌

రాష్ట్రంలో ఏడు జిల్లాల పరిధిలో 5 వందేభారత్‌ రైళ్లను నడుపుతున్నామని, రాబోయే రోజుల్లో మరిన్నింటిని నడుపుతామని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రెండుమూడేళ్లలో దేశవ్యాప్తంగా కొత్తగా 200 వందేభారత్‌ రైళ్లను తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్లను అమృత్‌భారత్‌ స్టేషన్‌ పథకం కింద పునరభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలో హైదరాబాద్‌-విజయవాడ మధ్య నమో భారత్‌ రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. పేద, మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని 1000 కిలోమీటర్ల దూరానికి రూ.450 చార్జీ ఉండే విధంగా అమృత్‌ భారత్‌ (నాన్‌ ఏసీ) రైళ్లను నడపనున్నట్లు చెప్పారు. మరోవైపు, దేశవ్యాప్తంగా 7వేల కిలో మీటర్ల పాత రైల్వే ట్రాక్‌లను మార్చే పనులను చేపట్టామని ఆయన వివరించారు. 2026కల్లా దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ విద్యుదీకరణను పూర్తి చేస్తామని చెప్పారు.


రూ.650కోట్లతో త్వరలో ఘట్‌కేసర్‌-యాదాద్రి ఎంఎంటీఎస్‌

ఘటకేసర్‌-యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుందని దక్షిణ మధ్య రైల్వే(ఎ్‌ససీఆర్‌) జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని రైల్‌ నిలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా రూ.650కోట్ల బడ్జెట్‌ అంచనాతో ఘటకేసర్‌-యాదాద్రి రైల్వేలైన్‌ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌, మౌలాలి నుంచి సనత్‌నగర్‌, ఫలక్‌నుమా నుంచి ఉమ్డానగర్‌ వరకు ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.491కోట్లు బకాయి పడిందని జైన్‌ చెప్పారు. అయినప్పటికీ రెండోదశ విస్తరణ పనులను ప్రారంభించే దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. అయితే, ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు వెలుపల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే రీజినల్‌ రింగ్‌రోడ్‌కు సమాంతరంగా రీజినల్‌ రింగ్‌ రైల్వేలైన్‌ వేసే ప్రతిపాదన ఏదీ బడ్జెట్‌లో లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జరిపి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును సమర్పిస్తేనే రైల్వేశాఖ నుంచి అనుమతి లభిస్తుందన్నారు.


ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,417కోట్లు

కేంద్రబడ్జెట్‌లో రైల్వేకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,417 కోట్లు కేటాయించినట్లు అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపులతో పోలిస్తే 11 రెట్లు ఎక్కువని అన్నారు. ఏపీలో రైల్వే అభివృద్ధి పనులకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు సహకరిస్తున్నారంటూ ఆయనకు కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 04:16 AM