Inter Results: ఇంటర్ ఫలితాలలో రికార్డు!
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:18 AM
ఇంటర్ విద్యార్థులు ఫలితాల్లో అదరగొట్టారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అందులోనూ అమ్మాయిలు ముందంజలో నిలిచారు.

గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత ఉత్తీర్ణత నమోదు
ఫస్టియర్‌లో 66.89%, సెకండియర్‌లో 71.37% పాస్
అమ్మాయిల్లో 74.0%, అబ్బాయిల్లో 57.56% ఉత్తీర్ణత
ఫస్టియర్‌లో మేడ్చల్, సెకండియర్‌లో ములుగు జిల్లా ఫస్ట్
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు నేటి నుంచే దరఖాస్తులు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ విద్యార్థులు ఫలితాల్లో అదరగొట్టారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అందులోనూ అమ్మాయిలు ముందంజలో నిలిచారు. ఈసారి 4,39,302 మంది ప్రథమ సంవత్సర పరీక్షలు రాయగా.. 2,93,852 మంది (66.89%) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 3,99,943 మంది హాజరవగా.. 2,85,435 మంది (71.37%) ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రథమ, ద్వితీ య సంవత్సరాల్లో కలిపి 4,99,440 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా.. 3,69,679 మంది (74.01%) ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 4,97,572 మంది పరీక్షలు రాయగా.. 2,86,420 మంది (57.56%) ఉత్తీర్ణులు అయ్యారు. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఉత్తీర్ణత తేడా 16.45 శాతం కావడం గమనార్హం. జిల్లాల వారీ ఫలితాల్లో ఫస్టియర్‌లో మేడ్చల్ (77.21%), సెకండియర్‌లో ములుగు (81.06) ప్రథమ స్థానంలో నిలిచాయి. ఫస్టియర్‌లో రంగారెడ్డి (76.36%), ఆసిఫాబాద్ (70.52%).. సెకండియర్‌లో ఆసిఫాబాద్ (80.24ు) , మేడ్చల్ (77.91%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులు
విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం బుధవారం నుంచి ఈ నెల 30 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.100 చొప్పున చెల్లించాలని తెలిపారు. రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ. 600 చెల్లించాలని, వారికి సమాధాన పత్రాల స్కాన్ కాపీ కూడా అందిస్తామని వెల్లడించారు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు వచ్చే నెల 22 నుంచి రోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తామని, ప్రాక్టికల్స్ జూన్ 3 నుంచి 6 వరకు ఉంటాయన్నారు.
పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి భేష్: డిప్యూటీ సీఎం
మంగళవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులను భట్టి ప్రశంసించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించా రు. కాగా, ఇంటర్ విద్యార్ధులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భవిష్యత్‌లో మీరు ఉన్నత చదువులు చదివి, జీవితంలో గొప్పగా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
గురుకుల విద్యార్థుల సత్తా
ఇంటర్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎస్టీ గురుకుల విద్యార్థులు 84.64శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విద్యాసంస్థలకు చెందిన కె.అఖిల (దేవరకొండ) బైపీసీ విభాగంలో 1000 మార్కులకు 996, కె.స్రవంతి (పరిగి) ఎంపీసీ విభాగంలో 994 మార్కులు సాధించారు. ఇక తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ విద్యార్థులు ఏకంగా 89.51శాతం ఉత్తీర్ణత పొందారు. సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 86.16ు, ప్రథమ సంవత్సరంలో 77.48ు ఉత్తీర్ణత సాధించారు. బీసీ గురుకులాల్లో సెకండియర్‌లో 83.17శాతం, ఫస్టియర్‌లో 78.15శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం..
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపం తో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురానికి చెందిన రాసాల మల్లేశం, సునీత దంపతుల మూడో కుమారుడు అరవింద్ యాదవ్ (17) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఇక పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జీడీనగర్‌లో తాపల్లె ఎల్లయ్య కుమార్తె శశిరేఖ (17) ద్వితీయ సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిలైంది. దీనితో ఆవేదన చెంది ఇంట్లోనే ఉరి వేసుకుంది. మరోవైపు హైదరాబాద్‌లోని తట్టిఅన్నారం వైఎస్సార్ కాలనీకి చెందిన సుక్క అరుంధతి (17) ఇంటర్‌లో ఫెయిలైన ఆవేదనతో ఉరివేసుకుంది. కాగా, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిన జోగుళాంబ గద్వాల జిల్లా మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వినోద్.. ఉత్తీర్ణత సాధించాడు.
గ్రూప్‌ల వారీగా ఫలితాలు
గ్రూప్ ఇంటర్-1 ఉత్తీర్ణత ఇంటర్-2 ఉత్తీర్ణత
విద్యార్థులు (శాతం) విద్యార్థులు (శాతం)
ఎంపీసీ 2,23,996 76.65 2,34,916 72.23
బైపీసీ 98,646 67.88 98,958 71.93
సీఈసీ 92,745 45.56 1,03,713 46.92
ఎంఈసీ 14,600 65.53 15,316 56.96
హెచ్‌ఈసీ 8,959 34.51 9,031 46.26
మొత్తం 4,38,946 66.88 4,61,934 65.46
అమ్మాయిలు-అబ్బాయిల ఫలితాలు ఇలా..
సంవత్సరం మొత్తం ఉత్తీర్ణత మొత్తం ఉత్తీర్ణత
అమ్మాయిలు (శాతం) అబ్బాయిలు (శాతం)
ప్రథమ 2,48,267 73.83 2,40,163 57.83
ద్వితీయ 2,51,173 74.21 2,57,409 57.31
మొత్తం 4,99,440 74.01 4,97,572 57.56
యాజమాన్యాల వారీగా ఫలితాల తీరు..
విభాగం ఇంటర్-1 ఉత్తీర్ణత ఇంటర్-2 ఉత్తీర్ణత
విద్యార్థులు శాతం విద్యార్థులు శాతం
ప్రైవేటు 3,33,808 69.08 3,46,697 65.83
ప్రభుత్వ 68,100 42.49 74,161 53.44
మోడల్ స్కూల్స్ 17,749 51.91 19,056 62.52
సాంఘిక సంక్షేమ 15,664 77.66 15,900 84.38
కేజీబీవీ 14,271 73 12,419 79.1
బీసీ వెల్ఫేర్ 13,105 78.4 13,279 81.98
టీఎంఆర్‌జేసీ 9,370 77.79 9,467 82.2
ట్రైబల్ వెల్ఫేర్ 7,882 69.97 8,052 81.53
ప్రైవేటు ఎయిడెడ్ 5,670 49.68 6,850 46.16
టీఎ్‌సఆర్‌జేసీ 2,560 92.73 2,465 92.9
కేంద్ర ప్రభుత్వ కాలేజీలు 158 72.78 169 81.66
టీజీఎ్‌సఆర్‌టీసీ 68 82.35 29 86.21
ప్రభుత్వ స్పోర్ట్స్ కాలేజీ 25 80 39 76.92
ఆటోడ్రైవర్ కూతురికి అత్యుత్తమ ర్యాంకు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండాకు చెందిన ఆటోడ్రైవర్ ఇస్లావత్ జానునాయక్ కుమార్తె.. ఇస్లావత్ పల్లవి ఇంటర్ బైపీసీలో 995 మార్కులు సాధించి.. రాష్ట్రస్థాయి ర్యాంకర్‌గా నిలిచింది. ఎంపీసీ విభాగంలో రంగారెడ్డి జిల్లా జాపాలకు చెందిన బకున సంజన, బోడ మధుశ్రీ 994 (ఆమనగల్లు), కాసుల ప్రజ్వలిత 993 (సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లి), శంకర్‌పల్లికి చెందిన నందిని 992 మార్కులు సాధించారు. ఇక ఫస్టియర్ ఎంపీసీలో 470 మార్కులకుగాను.. హైదరాబాద్ మణికొండకు చెందిన సి.అక్షయ 469, సిద్దిపేట జిల్లా తిమ్మాయిపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డి, చేవెళ్లకు చెందిన శృతిలయ 468, మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన స్వతంత్ర, చేవెళ్లకు చెందిన కిరణ్‌గౌడ్, సిద్దిపేట జిల్లా నంగునూరుకు చెందిన స్పందన, మెదక్ జిల్లా డి.ధర్మారానికి చెందిన రుత్విశ్రీ, ఆమనగల్లుకు చెందిన పల్లె సరిత, గజ్వేల్ సంగుపల్లికి చెందిన మ్యాక అరవింద 467 మార్కులు సాధించారు.
ఇవి కూడా చదవండి
Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు
Read Latest Telangana News And Telugu News