Share News

Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎ్‌సల బదిలీలు!?

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:51 AM

రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. భారీ స్థాయిలో అఖిల భారత సర్వీసుల అధికారులకు స్థానభ్రంశం కలగనుంది.

Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎ్‌సల బదిలీలు!?

  • ఐఎ్‌ఫఎస్‌ అధికారులకూ స్థానచలనం

  • పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు

  • ఆరోపణలున్న పోలీసు అధికారులపై వేటు!

  • ఇద్దరు కమిషనర్లు, ఎస్పీల మార్పు?

  • ముఖ్యమంత్రి వద్దకు చేరిన దస్త్రం!

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. భారీ స్థాయిలో అఖిల భారత సర్వీసుల అధికారులకు స్థానభ్రంశం కలగనుంది. ‘ఓ ఎస్పీ పోస్టింగ్‌ రాగానే దుకాణం మొదలుపెట్టారు. మరో ఐపీఎస్‌ శిక్షణ పూర్తి కాగానే యూనిఫాం వేసుకుని పంచాయితీలు ప్రారంభించారు. ఎస్పీలు, కలెక్టర్లు ఎసీ గదులు వదిలి జనంలోకి రావడం లేదు. ఉన్నతాధికారులు మారాలి. జనంలోకి వెళ్లాలి. పనితీరు మార్చుకోవాలి’ అని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖిల భారత సర్వీసుల అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేసేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఐఏఎస్‌, ఐపీఎ్‌సతో పాటు ఐఎ్‌ఫఎస్‌ అధికారులనూ బదిలీ చేయనున్నట్లు సమాచారం. అధికారుల పనితీరు ఆధారంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఉంటాయని తెలుస్తోంది. బదిలీల దస్త్రం ముఖ్యమంత్రికి వద్దకు చేరినట్లు సమాచారం.


పోలీస్‌ శాఖలో అనూహ్య మార్పులు?

పోలీస్‌ ఉన్నతాధికారుల పనితీరు ఆధారంగా బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారుల పనితీరుపై నిఘా వర్గాల నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి అందిన సమాచారం ప్రకారం అనూహ్య మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇద్దరు కమిషనర్లు, పలు జిల్లాల ఎస్పీలు, హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని పలువురు డీసీపీలను బదిలీ చేయనున్నారని తెలుస్తోంది. జిల్లాలు, కమిషనరేట్లలో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్‌ అధికారులు ఠంఛన్‌గా ఆఫీసు సమయానికి వచ్చి సాయంత్రం 6 గంటలకల్లా ఇళ్లకు చేరుతున్నారని సీఎంకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. కొందరు పోలీసు అధికారులు రాత్రి వరకు కార్యాలయాలు, క్షేత్రస్థాయిలో ఉండి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుండగా.. మరికొందరు విధులు ముగించామా? లేదా? అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు కమిషనర్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, కింది స్థాయి పర్యవేక్షణ కరవైందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఒక కమిషనర్‌ అయితే కార్యాలయానికే పరిమితమయ్యారని, కమిషనరేట్‌ పరిధిలో తిరగడమే మానేశారని.. ఈ సారి ఆయనపై వేటు తప్పదని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక జిల్లాల ఎస్పీల్లో కొందరి పనితీరు బాగా లేదని, కొందరు డీసీపీలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలిసింది. ఆరోపణలున్న అధికారులపై వేటు తప్పదని సమాచారం. అయితే సీనియర్‌ ఐపీఎ్‌సల బదిలీలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఏడాది డీజీపీ జితేందర్‌తో సహా ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌లు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పైస్థాయి బదిలీలను కొంత కాలం తర్వాత చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Mar 07 , 2025 | 04:51 AM