New Ration Cards: డిజైన్ ఖరారవ్వగానే రేషన్ కార్డుల పంపిణీ
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:26 AM
కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డుల్లో సభ్యుల నమోదు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,61,343 కుటుంబాలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరుచేయగా..

అప్పటి వరకు మంజూరు పత్రాల జారీ
వాటి ద్వారా రేషన్ పంపిణీ.. సంక్షేమ పథకాల్లో లబ్ధి
5,61,343 కొత్త రేషన్ కార్డులకు ఆమోదం
రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.09 కోట్లు
హైదరాబాద్, జులై 29 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డుల్లో సభ్యుల నమోదు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,61,343 కుటుంబాలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరుచేయగా.. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. కొత్త కార్డులకు సంబంధించిన డిజైన్లు ఇంకా ఖరారు కాకపోవడం, టెండర్ల అంశం కోర్టులో ఉండడంతో ప్రస్తుతానికి కార్డుల స్థానంలో.. మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి ద్వారానే రేషన్‌ను అందజేస్తామని, సంక్షేమపథకాలకు కూడా మంజూరు పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న రేషన్‌కార్డుల ప్రక్రియను ప్రారంభించే నాటికి రాష్ట్రంలో 89,95,282 కార్డులున్నాయి.
వీటిపై 2,81,47,565 మంది లబ్ధిదారులున్నారు. తాజాగా ప్రభుత్వం 5.61 లక్షల కొత్తకార్డులను ఆమోదించింది. ఉన్న కార్డుల్లో అదనపు సభ్యుల చేరికలు కలిపి.. రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య 95.56 లక్షల పెరగ్గా.. లబ్ధిదారుల సంఖ్య 3.09 కోట్లకు చేరుకుంది. కొత్తకార్డుదారులకు ఇచ్చే మంజూరు పత్రాల ఆధారంగా వారికి సెప్టెంబరు నుంచి రేషన్ విడుదల అవుతుందని అధికారులు తెలిపారు. కార్డులు జారీ అయ్యేవరకు.. మంజూరు పత్రాలను సంక్షేమ పథకాలకు పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. గతంలో రేషన్‌కార్డుదారులు సంక్షేమ పథకాల కోసం టీఎ్‌స-పీడీఎస్ పోర్టల్‌లో తమ కార్డు వివరాలను ప్రింట్ చేయించి, దాన్ని లామినేట్ చేసి వినియోగించేవారు. ఇప్పుడు మంజూరు పత్రం ఆధారంగా ఆరోగ్యశ్రీతోపాటు.. మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న గృహజ్యోతి(200 యూనిట్ల ఉచిత విద్యుత్తు), రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు తదితర పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News