Congress: క్యాబినెట్‌లో చోటు కల్పించండి!
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:55 AM
మంత్రి వర్గ విస్తరణలో చోటు కోసం చివరి దాకా పోటీ పడిన పలువురు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమయ్యారు.

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆశావహుల వినతి.. తమకే ఎందుకు ఇవ్వాలో తెలుపుతూ వివరణ
ప్రత్యేకంగా కలిసిన కొండా దంపతులు
హైదరాబాద్, జూలై 3(ఆంధ్రజ్యోతి): మంత్రి వర్గ విస్తరణలో చోటు కోసం చివరి దాకా పోటీ పడిన పలువురు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమయ్యారు. తమకు ఉన్న అర్హతలను వివరించడంతోపాటు పార్టీకి చేసిన సేవలను గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, బాలూ నాయక్.. ఖర్గేతో ముఖాముఖి భేటీ కాగా, అందరి అభిప్రాయాలను ఆయన సావధానంగా విన్నారు. రెండు దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని బతికించుకుంటూ వస్తున్నానని ప్రేమ్‌సాగర్‌రావు వివరించారు. పార్టీ కోసం దగ్గరి బంధువులతోనూ శత్రుత్వం పెంచుకోవాల్సి వచ్చిందని ఖర్గే దృష్టికి తెచ్చారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు.. ఇంద్రవెల్లి సభ సందర్భంగా తనకు హామీ కూడా ఇచ్చారని చెప్పినట్లు సమాచారం. తనకు కాకుండా ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు.. రాష్ట్రంలో సగం జనాభా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఉంటే.. రెండు జిల్లాలకు కలిపి ఒక్క మంత్రి పదవి కూడా లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని ఖర్గే దృష్టికి తెచ్చారు. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ బలం పుంజుకుంటోందని, లోక్‌సభ ఎన్నికలే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఇచ్చిన జిల్లాకే మళ్లీ మంత్రి పదవి ఇవ్వడమూ సరికాదని, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాలని కోరారు. మంత్రి కావడానికి తనకు ఉన్న అర్హతలను వివరించారు. ఇదిలా ఉంటే పార్టీలో సీనియర్‌గా తనకు అవకాశం కల్పించాలని సుదర్శన్‌రెడ్డి కోరారు. మంత్రివర్గంలో బంజారాలకు అన్యాయం జరిగిందంటూ ఖర్గేకు బాలూ నాయక్ ఫిర్యాదు చేశారు. బంజారాల్లో 80శాతం మంది కాంగ్రె్‌సకే మద్దతుగా నిలిచారని,అయినా న్యాయం జరగలేదన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి.. తాను మంత్రి పదవికి ఏ విధంగా అర్హుడినో వివరిస్తూ ఖర్గేకు నివేదికను అందించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా.. మంత్రివర్గంలో చోటు దక్కని వ్యక్తిని తానొక్కడినేనని తెలిపారు. ఆశావహులు చెప్పినదంతా సావధానంగా విన్న ఖర్గే.. ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. అలాగే, మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి సైతం ప్రత్యేకంగా ఖర్గేను కలిశారు. ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలపై మురళి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో.. మురళి, సురేఖ నేరుగా ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. కాగా, అగ్రికల్చర్ వర్సిటీ వీసీ జానయ్య, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితోనూ ఖర్గే భేటీ అయి, ఆయా అంశాలపై వారితో చర్చించారు.
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News