Share News

Kaleshwaram Project: క్యాబినెట్‌ ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణం!

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:29 AM

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి నాటి మంత్రివర్గం ఆమోదం లేదని ప్రస్తుత మంత్రివర్గం నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులతోనే వీటి నిర్మాణానికి నిర్ణయం..

Kaleshwaram Project: క్యాబినెట్‌ ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణం!

  • సవరించిన అంచనాలకే మధ్యలో ఆమోదం

  • కేసీఆర్‌ నిర్ణయం మేరకే దీర్ఘకాలం నీటి నిల్వ

  • దానివల్లే కింద ఇసుక జారి కుంగిన బ్యారేజీ

  • కమిషన్‌ ముందు కేసీఆర్‌ సాక్ష్యం నేపథ్యంలో ఆయన క్యాబినెట్‌ భేటీల తీర్మానాల జల్లెడ

  • మీటింగ్‌ మినిట్స్‌ను కమిషన్‌కు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయం

  • 5 సాగునీటి ప్యాకేజీల సవరణలకు ఆమోదం

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి నాటి మంత్రివర్గం ఆమోదం లేదని ప్రస్తుత మంత్రివర్గం నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులతోనే వీటి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు చెప్పినప్పటికీ దానినిబలపరిచే సాక్ష్యాలేవీ ప్రభుత్వ రికార్డుల్లో లేవని మంతివర్గం అభిప్రాయపడినట్లు సమాచారం. బ్యారేజీల నిర్మాణాలకు పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చిన తర్వాత నిర్మాణం జరుగుతున్న క్రమంలో సవరించిన అంచనాలకు మాత్రమే అప్పటి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తేల్చారు. ఈ నెల మొదటి పక్షంలో ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, కేసీఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ ముందు హాజరై బ్యారేజీలకు మంత్రివర్గం ఆమోదం ఉందంటూ సాక్ష్యమిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ ఆమోదం తీసుకున్నాకే బ్యారేజీలు కట్టినట్లు ముగ్గురూ చెప్పిన నేపథ్యంలో కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన 96 మంత్రివర్గ సమావేశాల తీర్మానాలన్నీ తెప్పించి, పరిశీలించారు. రూ.2591 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతినివ్వాలని కోరుతూ 2016 ఫిబ్రవరి 18న ఈఎన్‌సీ(ఇరిగేషన్‌) సి.మురళీధర్‌ ఫైలు పంపించారని ప్రస్తుత మంత్రివర్గం గుర్తించింది.


కానీ, అంతకుముందే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థాయిలో నిర్ణయం జరిగిపోయిందని మంత్రులు చర్చించారు. ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్‌లో భాగంగా 2016 మార్చి 1వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి జీవో విడుదలైందని, తర్వాతే 2016 మార్చి 15న హరీశ్‌ చైర్మన్‌గా, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్‌ సభ్యులుగా ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్‌పై కమిటీ వేశారని గుర్తించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నాకే ఆయా ప్రాంతాల్లో బ్యారేజీలకు అనుకూలంగా వ్యాప్కో్‌సతో నివేదిక తెప్పించుకున్నారని మంత్రివర్గం నిర్ధారించింది. వ్యాప్కో్‌సకు బ్యారేజీల డీపీఆర్‌ తయారీ బాధ్యతలను అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా సంఘటనల క్రమాన్ని ధ్రువీకరించుకుంది. వ్యాప్కోస్‌ సిఫారసుల తర్వాతే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్‌ ముందు ముగ్గురు చెప్పిన దాంట్లో నిజాలు లేవని మంత్రివర్గం అభిప్రాయపడింది. భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయకుండానే బ్యారేజీల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర మంత్రివర్గం గమనించింది. 2016లో బ్యారేజీల నిర్మాణం ప్రారంభించగా, 2019 మే నాటికి బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే స్థాయిలో పనులు జరిగాయని, అయితే, అప్పటికి నిల్వ అధికారం అధికారులకు లేదని, అప్పటి సీఎం స్థాయిలోనిర్ణయం మేరకే మూడు బ్యారేజీల్లో నీటి నిల్వ చేశారని భావించాల్సి ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. వరదల సమయంలో బ్యారేజీల్లో నీటిని వదలాల్సి ఉండగా గేట్లు మూసి బ్యారేజీల్లో నీటి నిల్వ చేశారని, ఎక్కువ కాలం నీటిని నిల్వ చేయడం వల్ల సీకెంట్‌ పైల్స్‌ నుంచి ఇసుక జారి మేడిగడ్డ కుంగిందని, అన్నారం, సుందిళ్లలో సీపేజీలు ఏర్పడ్డాయని ప్రస్తుత మంత్రివర్గం ఒక అంచనాకు వచ్చింది. బ్యారేజీల నీటి నిల్వ అధికారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థాయిలోనే తీసుకున్నారని, మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసి, ఆ ఫొటోలు తీసి, వంద కిలోమీటర్ల పొడవునా గోదావరి సజీవంగా చేశామని ప్రచారం చేసుకున్నారని మంత్రుల చర్చలో అభిప్రాయం వ్యక్తం అయ్యింది. కేసీఆర్‌, హరీశ్‌, ఈటల చెప్పిన దానికి కౌంటర్‌గా అంశాల వారీగా ఫైళ్లను కమిషన్‌కు అందించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.


జూలై 15న కమిషన్‌ నివేదిక?

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ అవకతవకలపై విచారణ జరుపుతున్న కమిషన్‌ జూలై 15న నివేదిక అందించే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈలోగా నివేదిక సమర్పించడానికి అవసరమైన పత్రాలు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అందించాలని అధికారులకు నిర్దేశించింది. ఈ నెల 30లోగా సమాచారం అందించాలని కమిషన్‌ కోరినందున సమగ్ర వివరాలను సమర్పించాలని చెప్పింది. కాళేశ్వరానికి సంబంధించి నాడు ఏం జరిగిందో పూర్తి అవగాహనకు వచ్చేందుకు మంత్రివర్గం మీటింగ్‌ మినిట్స్‌ కూడా కమిషన్‌కు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.


ప్రాజెక్టుల సవరణ అంచనాలకు ఆమోదం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మూడు ప్యాకేజీల సవరణ అంచనాలతో పాటు రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలకు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలకు, మొడికుంట వాగు ప్రాజెక్టు సవరణ అంచనాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


స్థానిక పోరుపై ఏజీతో చర్చించాకే...

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేయడంతో ఆ అంశంపై చర్చించలేదు. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)తో చర్చించాకే తదుపరి కార్యాచరణకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పర్యటనలో ఉన్న పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క మంత్రివర్గ సమావేశానికి రాలేకపోవడం కూడా ఈ అంశాన్ని చర్చించకపోవడానికి మరో కారణం.


ఇవి కూడా చదవండి..

అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 03:29 AM