Tummala Nageswara Rao: రైతుల సమస్యలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:06 PM
రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి లేఖ రాశారు.
సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సమస్యలపై కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) మరోసారి లేఖ రాశారు. 'మొంథా'(Montha Cyclone) తుఫాను, అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, రైతులకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అలానే సోయాబీన్ ఎఫ్ఏక్యూ ప్రమాణాల్లో సడలింపు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. వర్షాల ప్రభావంతో గింజల్లో రంగు మారడం, ముడతలు వచ్చాయి. NAFED, NCCF సంస్థలకు పంటల నాణ్యత సడలింపు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల కోరారు.
రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు(Soybean Procurement) చేశారని, ఎకరాకు 7.62 క్వింటాళ్ల సగటు దిగుబడి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 48,757 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయడంతో 14,519 మంది రైతులకు లాభం చేకూరిందని మంత్రి తెలిపారు. కనీస మద్దతు ధర( MSP Procurement) కింద మొత్తం 16.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు NAFED, NCCF సంస్థలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోళ్లలో ఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి అనేది రైతులకు నష్టం చేకూరుస్తుందని, ఆ పరిమితిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తి తేమ శాతం సడలించి, ఎకరాకు 11.74 క్వింటాళ్ల దిగుబడి ఆధారంగా కొనుగోలు కొనసాగించాలని కేంద్రానికి సూచించారు. పత్తి( Cotton Procurement), మొక్కజొన్న, సోయాబీన్ రైతులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
Dasoju Sravan: సీఎం రేవంత్‌పై దాసోజ్ శ్రవణ్ కీలక వ్యాఖ్యలు
పెట్టుబడులతో ముందుకు రండి.. అంతా మాదే బాధ్యత: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News