Share News

Khammam: కొత్తగూడెం, సాగర్‌లలో ఏఏఐ బృందం

ABN , Publish Date - Jan 24 , 2025 | 04:19 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిసరాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సర్వే బృందం గురువారం పరిశీలించింది.

Khammam: కొత్తగూడెం, సాగర్‌లలో ఏఏఐ బృందం

  • విమానాశ్రయాల ఏర్పాటుకు స్థలాల పరిశీలన

కొత్తగూడెం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిసరాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సర్వే బృందం గురువారం పరిశీలించింది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండల పరిధిలోని గరీబ్‌పేట, రామవరం ప్రాంతంలోని 950 ఎకరాల స్థలాలను ఆ బృందం పరిశీలించింది. ఈ బృందానికి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ విమానాశ్రయ ఏర్పాటు ప్రతిపాదనను వివరించారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్రతినిధి బృందంతో జిల్లా యంత్రాంగం, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్‌ పాటిల్‌ సమావేశమయ్యారు.


ఇక, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు కుడివైపున ఏపీలోని పల్నాడు జిల్లా రైట్‌ బ్యాంకు (విజయపురి సౌత్‌) వద్ద స్థలాన్ని బృంద సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర బృంద సభ్యుడు ఏఎ్‌సఎన్‌ మూర్తి మాట్లాడుతూ.. దాదాపుగా 1,600 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు ఏపీలో పలు ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించినట్లు చెప్పారు. కొత్త విమానాశ్రయం ఏర్పాటైతే తెలంగాణలోని పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి నివేదికను కేంద్ర బృందం త్వరలో కేంద్రానికి అందచేయనుంది. ఆ తర్వాత మరోసారి కేంద్రం నుంచి సాంకేతిక నిపుణుల బృందం కూడా రానుంది.

Updated Date - Jan 24 , 2025 | 04:19 AM