ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం డీపీఆర్ తయారీకి 4-5 కంపెనీలు సిద్ధం
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:04 AM
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం రహదారికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను అందించేందుకు నాలుగైదు కంపెనీలు ముందుకొచ్చాయి.

సాంకేతిక బిడ్లను తెరిచిన రోడ్లు, భవనాల శాఖ
టెండర్ ఎవరికి ఇచ్చేదీ వారం రోజుల్లోగా ఖరారు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం రహదారికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను అందించేందుకు నాలుగైదు కంపెనీలు ముందుకొచ్చాయి. దక్షిణభాగం డీపీఆర్ కోసం రోడ్లు, భవనాల శాఖ జనవరి 20న టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి.. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు సాంకేతిక (టెక్నికల్)బిడ్‌లను అధికారులు తెరిచి దాఖలైన టెండర్లను పరిశీలించారు. టెక్నికల్ బిడ్‌లలో అర్హులుగా తేలినవారి జాబితాను తయారుచేసి.. నిబంధనలకు అనుగుణంగా ఉన్న కంపెనీకి పనులను అప్పగించనున్నారు. ఈ ప్రక్రియ నిర్వహణ, కంపెనీ ఖరారుకు దాదాపు వారం పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఆసక్తి చూపిన సంస్థల్లో ఒకటి రెండు కంపెనీలను కలిపి కూడా పనులు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే అనుకున్న దానికంటే అదనంగా 11 కిలోమీటర్ల మేర రహదారి దూరం పెరగడంతో.. దాన్ని కూడా కలిపి 200 కిలోమీటర్లకు డీపీఆర్ ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు. దానిని కేంద్రానికి సమర్పించి దాని ప్రకారం రహదారి నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరాలనే భావనలో రాష్ట్ర సర్కారు ఉంది. అందుకే డీపీఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించింది. కేంద్రం అందుకు సుముఖత వ్యక్తం చేయకపోతే తాము నిర్మించేందుకైనా ఈ డీపీఆర్ ఉపయోగపడుతుందని భావిసున్నట్టు సమాచారం. కాగా దక్షిణభాగం రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు, వాటి సేకరణ, ప్రాజెక్టు మానిటరింగ్ కోసం ప్రత్యేకంగా టెండర్లను ఆహ్వానించి.. ఫిబ్రవరి 25 తుదిగడువుగా ప్రకటించారు.
తేలనున్న వివరాలు..
రహదారి మార్గం (అలైన్ మెంట్) దగ్గరి నుంచి రోడ్డు నిర్మాణ విధానం సహా పలు అంశాలు సమగ్ర ప్రాజెక్టు నివేదికలో తేలనున్నాయి. రహదారి నిర్మాణం, మార్గమధ్యంలో నిర్మించే వెహి కల్ అండర్ పాస్, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, క్రాసింగ్, జంక్షన్‌లు, ఎక్కడెక్కడ టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందనేది తెలియనుంది. ఆ మార్గంలో ఏమైనా గ్రామాలు, ఆవాసాలు ఉన్నాయా? ఉంటే అక్కడ ఎంతమంది నివసిస్తున్నారు? చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయి? సాగు, అటవీ భూములు తదితర వివరాలను సేకరిస్తారు. రోడ్డు నిర్మాణానికి సేకరిస్తున్న భూముల వివరాలతో పాటు నిర్మాణ వ్యయ అంచనాలు కూడా సమగ్ర ప్రాజెక్టు నివేదికలో తెలియనున్నాయి. దీంతోపాటు ఈ రహదారిని ఏ పద్ధతిలో నిర్మించాలి, ఏ విధానంలో నిర్మిస్తే లాభదాయకంగా ఉంటుందన్న అంచనాలు కూడా తెలుస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News