Share News

Phone Tapping: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫోన్‌ ట్యాప్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:21 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైన ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

Phone Tapping: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫోన్‌ ట్యాప్‌

  • మావోయిస్టుల సమాచారం కోసమంటూ గత ప్రభుత్వ హయాంలో..

  • రివ్యూ కమిటీకి 615 మంది నంబర్లు

  • వాటిలో ఆంధ్రజ్యోతి ఎండీ నంబరు కూడా

  • రాధాకృష్ణకు సిట్‌ అధికారుల సమాచారం

  • వాంగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం

  • పెన్‌డ్రైవ్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ సంభాషణలు

  • నాటి ప్రభుత్వంలోని పెద్దలకు అందజేత?

  • అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌లో చక్రం తిప్పిన నవీన్‌రావు, శ్రవణ్‌రావు, ప్రణీత్‌రావు!

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌రావుపై సిట్‌ నజర్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైన ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. మావోయిస్టుల సమాచారం కోసమంటూ అక్రమంగా ట్యాపింగ్‌ చేయించిన ఫోన్‌ నంబర్లలో ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ నంబర్‌ కూడా ఉన్నట్లు నిర్ధారించారు. రాధాకృష్ణ ఫోన్‌ను ట్యాప్‌ చేయించడం ద్వారా ఆయన సంభాషణలను రోజుల తరబడి విన్నారు. ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఈ మేరకు సిట్‌ అధికారులు బుధవారం సాయంత్రం ‘ఆంధ్రజ్యోతి’ ఎండీకి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీలో అక్రమంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌వోటీ) రాజకీయ నాయకులతో పాటు జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పలువురు సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేయడంపై సిట్‌ అధికారులు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులకు ఫోన్లు చేసి పిలిపించుకుని వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటున్నారు. రాధాకృష్ణ నుంచి కూడా వాంగ్మూలం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మావోయిస్టుల సమాచారం కోసమంటూ..

ఆనాటి ఎస్‌ఐబీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని బృందాలు మావోయిస్టుల సమాచారం పేరిట అనుమతులు తీసుకుని పలువురు ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్‌ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ ఎండీతోపాటు 615 మంది ఫోన్‌ నంబర్లను ప్రభాకర్‌రావు మావోయిస్టుల సమాచారం కోసమంటూ ట్యాపింగ్‌కు అనుమతి కోరుతూ రివ్యూ కమిటీకి పంపారు. ఈ నంబర్లను పరిశీలించి పంపాల్సిన నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌, డీజీపీ అంజనీకుమార్‌.. సాధారణ నంబర్లుగా భావించి రివ్యూ కమిటీకి పంపారు. అయితే రివ్యూ కమిటీలోని సభ్యులు సైతం వీటిని పరిశీలించకుండానే ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వడంతో ప్రభాకర్‌రావు టీం అక్రమానికి పాల్పడ్డారు. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి మోసపూరితంగా అనుమతులు పొందిన విషయమై హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రావు మోసపూరితంగా వ్యవహరించారన్న విషయాన్ని అఫిడవిట్‌ రూపంలో గతంలో హైకోర్టుకు అందజేశారు. నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు సైతం ప్రభాకర్‌రావు తమను మోసం చేశారన్న కోణంలోనే సిట్‌ ప్రశ్నలకు సమాధానాలు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సిట్‌ విచారణలో.. 615 మందికి సంబంధించిన కాల్‌ రికార్డులు, 2023 నవంబరు 15 నుంచి జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ రికార్డులు, వాట్సాప్‌ సంభాషణల వివరాల ఆధారంగా బాధితుల నుంచి సిట్‌ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు.


పెన్‌డ్రైవ్‌లో పెద్దలకు సంభాషణలు..

మావోయిస్టుల సమాచారం కోసమంటూ వందల సంఖ్యలో ఫోన్‌ ట్యాపింగ్‌ అనుమతులు పొందిన ప్రభాకర్‌రావు.. అసలు అనుమతే తీసుకోకుండా వివిధ ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు వ్యవస్థ ద్వారా వేల సంఖ్యలో ఫోన్‌ నంబర్లను ట్యాపింగ్‌ చేసి సంభాషణలు విన్నట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది. వాటిలో ముఖ్యమైన వారి సంభాషణల్ని రికార్డు చేసి పెన్‌డ్రైవ్‌లో నాటి ప్రభుత్వ పెద్దలకు పంపించినట్లు అయితే.. పెన్‌డ్రైవ్‌లు ఎవరికి చేరాయి? ఎవరు తీసుకెళ్లి ఇచ్చారు? ట్యాపింగ్‌ చేయాల్సిన ఫోన్‌ నంబర్లను ఎస్‌ఐబీకి ఎవరిచ్చారు? నాటి ప్రభుత్వంలోని పెద్దల పాత్ర ఏంటి? అనే విషయాలకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి సాక్ష్యాధారాలు సిట్‌కు లభించలేదని తెలుస్తోంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు పలుమార్లు ప్రశ్నించినప్పటికీ.. రాజకీయపరమైన ఆదేశాలకు సంబంధించి ఆయన పెదవి విప్పలేదని తెలుస్తోంది. నాటి డీజీపీలు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లు చెబితేనే చేశానంటూ వాదిస్తున్నారని సిట్‌ అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాలు ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు సరిపోతాయని, అయితే సుప్రీంకోర్టు మధ్యంతర ఉపశమనం ఇవ్వడంతో ఆగస్టు 5వ తేదీ వరకు చట్టపరంగా ఆయనను ఏమీ చేయలేమని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదన్న విషయాన్ని అఫిడవిట్‌ రూపంలో సుప్రీంకోర్టుకు తెలియచేసి మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాల్సిందిగా కోరతామని అంటున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ డేటాలో 90 శాతానికి పైగా ధ్వంసం చేయడంలో ప్రభాకర్‌రావు టీం సక్సెస్‌ అయిందని, కేవలం 2023 నవంబరుకు సంబంధించి 618 ఫోన్‌ నంబర్ల డేటా మాత్రమే తమ వద్ద ఉందని పేర్కొంటున్నారు. ఇందులో బీఆర్‌ఎస్‌ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులు ఉన్నారని సిట్‌ అధికారులు చెబుతున్నారు.


త్వరలో ఎమ్మెల్సీ నవీన్‌రావు విచారణ!

ఫోన్‌ ట్యాపింగ్‌లో పరోక్షంగా కీలకపాత్ర పోషించిన బీఆర్‌ఎస్‌ నేతలపైనా సిట్‌ అధికారులు దృష్టి సారించారు. ఎస్‌ఐబీ నుంచి పెన్‌డ్రైవ్‌ల ద్వారా ఫోన్‌ ట్యాపింగ్‌ సంభాషణల సమాచారాన్ని అందుకున్న ఆ పార్టీ నేతలను విచారించడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రైవేట్‌ వ్యక్తి అయిన మీడియా చానల్‌ అధినేత శ్రవణ్‌రావును ఫోన్‌ ట్యాపింగ్‌లోకి తీసుకురావడం వెనుక కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.నవీన్‌రావును విచారించడానికి సిట్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు సిట్‌ నుంచి పిలుపు అందవచ్చని సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా వచ్చిన సమాచారాన్ని అడ్డం పెట్టుకుని ప్రణీత్‌రావు, శ్రవణ్‌రావుల ద్వారా నవీన్‌రావు పలు దందాలు చేశారంటూ కాంగ్రెస్‌ నాయకులు గతంలో పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులైన కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన అగ్రనాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, వారి అనుచరులు, వ్యక్తిగత సిబ్బంది నుంచి వాంగ్మూలాలు రికార్డు చేసిన సిట్‌.. తాజాగా బీఆర్‌ఎ్‌సకు చెందిన బాధితులను కూడా విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌లో బాధితులైన ఆనాటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రులు, ఇతర నాయకులను విచారణకు పిలవడానికి సన్నాహలు ప్రారంభించినట్లు సమాచారం.


విచారణకు కాంగ్రెస్‌ నేతల హాజరు..

ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులైన పలువురు కాంగ్రెస్‌ నాయకులు, వారి అనుచరులు బుఽధవారం సిట్‌ ముందు హాజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ అధ్యక్షుడు ఫహీమ్‌ ఖురేషీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. తన ఫోన్‌తోపాటు తన భార్య ఫోన్‌ను, కారు డ్రైవర్‌ ఫోన్‌ను కూడా ట్యాపింగ్‌ చేశారని సిట్‌ అధికారులు తెలిపినట్లు ఫహీమ్‌ ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాజకీయాల్లో ఉన్న తన ఫోన్‌తోపాటు తన భార్య ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేయడం దారుణమన్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలను సైతం విన్నారని, అధికారం కోసం ఇంత నీచానికి దిగజారుతారా? అని మండిపడ్డారు. గత ఎన్నికల ముందు తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ అన్నారు. ‘‘తల్లీపిల్లల సంభాషణలు, భార్యాభర్తల సంభాషణలు వింటారా? మీకు కుటుంబాలు లేవా?’’ అని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డ అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా, తాను బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరినప్పటి నుంచి తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్‌ అధికారుల ద్వారా నిర్ధారణ అయిందని కామారెడ్డి కాంగ్రెస్‌ నేత గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తన సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారని, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డితో బూత్‌ కమిటీ సమావేశాల్లో మాట్లాడుతున్న సమయంలో తమపై దాడి చేశారని, ఇంట్లో సోదాలు చేసి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్

సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు

For National News And Telugu News

Updated Date - Jun 26 , 2025 | 06:20 AM