Share News

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:25 AM

సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

  • 46కి చేరిన మృతుల సంఖ్య.. 9 మంది గల్లంతు

  • ఆస్పత్రుల్లో 30 మందికి చికిత్స.. వారిలో 10 మంది పరిస్థితి విషమం

  • ‘సిగాచి’ శిథిలాల నుంచి మరో 16 మృతదేహాల వెలికితీత

  • వాటిలో 13 గుర్తింపు.. కుటుంబసభ్యులకు అప్పగింత

  • పేలుడు తీవ్రతకు మాంసంముద్దలు, బూడిద కుప్పలుగా

  • మృతదేహాలు.. డీఎన్‌ఏ పరీక్షకు ఎముకలు, దంతాల సేకరణ

  • సాగుతున్న గాలింపు.. మృతుల సంఖ్య పెరిగే ముప్పు

  • పరిశ్రమ ఎండీ చిదంబరనాథ్‌ ఎక్కడ?.. రెండు రోజులుగా

  • ఆయన పరిశ్రమవైపుగా రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం

  • అక్కడే ప్రేమించుకుని.. అక్కడే కన్నుమూసి

  • సిగాచి పరిశ్రమ ప్రమాదంలో ఓ యువ జంట మృత్యువాత

సంగారెడ్డి ప్రతినిధి, పటాన్‌చెరు, పటాన్‌చెరు రూరల్‌, దండేపల్లి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. శిథిలాల కింద మంగళవారం సాయంత్రానికి మరో 16 మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో ఐదుగురు చనిపోయినట్లు తెలిసింది. తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో ఉన్న 30 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా.. మరో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక.. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్నవారిలో 14 మంది ఆచూకీ మంగళవారం సాయంత్రం వరకూ తెలియరాలేదు. వారిలో ఐదుగురి మృతదేహాలను అర్ధరాత్రి సమయానికి గుర్తించినట్టు సమాచారం. మిగిలిన 9 మంది ఆచూకీ ఇంకా తెలియకపోవడం.. ఆస్పత్రుల్లో ఉన్న పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. పరిశ్రమలో పేలుడు తీవ్రతకు కూలిన మూడంతస్తుల భవనం శిథిలాలు తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా.. ప్రమాదస్థలికి సమీపంలో ఎక్కడ చూసినా మాంసపు ముద్దలు.. బూడిదకుప్పలే కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా దొరికిన మృతదేహాలను పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. వాటిలో ఇప్పటిదాకా 13 మృతదేహాలను గుర్తించగా.. మిగతా మృతదేహాలు ఎవరివో గుర్తించాల్సి ఉంది. గుర్తించలేనంతగా కాలిపోవడంతో ఏ మృతదేహం ఎవరిదో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని మృతదేహాలకూ పోస్టుమార్టంతోపాటు డీఎన్‌ఏ పరీక్షలూ నిర్వహిస్తున్నారు. కాగా, పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ గోడలు కూలి, మంటల్లో చిక్కుకొని కాలిన గాయాలతో చనిపోయినవారిని వారి కుటుంబసభ్యులు గుర్తించగలిగారు. కానీ.. ప్రమాద స్థలానికి సమీపంలో విధులు నిర్వర్తిస్తూ.. పేలుడు ధాటికి మాంసపు ముద్దలుగా మారిన వారిని మాత్రం గుర్తించలేని పరిస్థితి. వారిలో కొందరి మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదకుప్పలుగా మారినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. ఫోరెన్సిక్‌ నిపుణులు మంగళవారం ఘటనాస్థలికి చేరుకుని దాదాపు 4 గంటలపాటు శ్రమించి.. పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్న ఎముకలు, దంతాలు, ఇతర నమూనాలు సేకరించారు. ఎముకలు, దంతాలతోపాటు బూడిదను కూడా కవర్లలో సేకరించినట్లుగా తెలుస్తున్నది.


గల్లంతైనవారు ఎక్కడ?

ప్రమాద సమయంలో పరిశ్రమలోని అన్ని విభాగాల్లో 143 మంది ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇందులో 58 మంది సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. 46 మంది చనిపోతే 30 మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. ఈ లెక్కన మరో 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి మృతదేహాలు కూడా శిథిలాల కిందే ఉన్నాయా? అనే విషయంపై స్పష్టత రావడం లేదు. దీంతో.. గల్లంతైన తమవారి ఆచూకీ చెప్పాలంటూ వారి బంధువులు అధికారులను వేడుకుంటున్నారు. మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుండడంతో.. రెండు రోజులుగా పరిశ్రమ పరిసరాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో మరణించినవారిలో ఇప్పటిదాకా 13 మందిని గుర్తించిన అధికారులు.. వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. దాంతోపాటు తక్షణ సాయంగా ఒక్కొక్క కుటుంబానికీ రూ.లక్ష చొప్పున.. రూ.13లక్షలను సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్య అందజేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఇచ్చారు. వారు స్వస్థలాలకు వెళ్లడానికి అధికారులే అంబులెన్సులు ఏర్పాటు చేశారు.

మృతుల్లో మంచిర్యాల జిల్లావాసి ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన మరో వ్యక్తి కూడా!

33.jpg

దండేపల్లి జూలై 1 (ఆంధ్రజ్యోతి): సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం జరిగిన భారీ పేలుడులో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన వజ్రకేసర నాగేశ్వర్‌రావు ఆలియాస్‌ రాజు(52) దుర్మరణం పాలయ్యారు. ఆయన పదేళ్లుగా సిగాచి ఫ్యాక్టరీలో కెమికల్‌ ల్యాబ్‌లో క్వాలిటి సెల్‌ విభాగంలో పని చేస్తున్నారు. అధికారులు ఆయన మృతదేహాన్ని మంగళవారం ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగేశ్వర్‌రావుకు భార్య హేమలత, తల్లి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. బుధవారం దండేపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన హేమంత్‌సుందర్‌ (45) ఈ ప్రమాదంలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.


ప్రమాద స్థలంలో కాంట్రాక్టు కార్మికులు?

  • సోమవారమే విధుల్లోకి.. ఒక గదిలో వారి సెల్‌ఫోన్లు లభ్యం

  • నిజమైతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రజ్యోతి, జూలై 1: సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదంలో మరో అంశం ఆలస్యంగా తెరమీదకు వచ్చింది. ప్రమాద సమయంలో రెగ్యులర్‌గా పనిచేసే సిబ్బంది, కార్మికుల లెక్క 143 మంది అని తేలింది. అయితే, సోమవారం ఫ్యాక్టరీలో అదనపు పని ఉన్నందున మరికొంత మంది కాంట్రాక్టు కార్మికులను సైతం విధులకు పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టు లేబర్లు కావడంతో వీరికి సంబంధించిన వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయరని తెలిసింది. వీరి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను మాత్రం ఓ గదిలో భద్రపరిచారని సమాచారం. తాజాగా సెల్‌ఫోన్లు కూడా బయట పడడంతో ఇవి కాంట్రాక్టు కార్మికులకు చెందినవేనని చర్చ నడుస్తోంది. సంస్థ రెగ్యులర్‌ ఉద్యోగులు, కార్మికుల ఫోన్లు వారి వద్దనే ఉంటాయని, కాంట్రాక్టు లేబర్లవి మాత్రం పని వేళల్లో స్వాధీనం చేసుకుంటారని తెలుస్తోంది. అదనపు పనులు ఉన్న సమయంలో సాధారణంగా కాంట్రాక్టు కార్మికులను పిలుస్తారని చెబుతున్నారు. ఒకవేళ కాంట్రాక్టు కార్మికులు వచ్చి ఉంటే శిథిలాల కింద గల్లంతయ్యారా లేక బయటకు వెళ్లిపోయారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉన్న సెల్‌ ఫోన్ల సంఖ్యను బట్టి ఎంత మంది వచ్చారు? సెల్‌ఫోన్లు కాంట్రాక్టు కార్మికులవేనా? అని అధికారులు ఆరా తీస్తున్నారు. సోమవారం పనులకు కాంట్రాక్టు కార్మికులు కనుక హాజరైతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

అక్కడే ప్రేమించుకుని.. అక్కడే కన్నుమూసి..

33.jpg

రామచంద్రాపురం టౌన్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి)/విజయవాడ (తిరువూరు, విస్సన్నపేట), ముద్దనూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఇద్దరూ అదే కంపెనీలో పనిచేస్తున్నారు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు.. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ప్రేమపెళ్లి చేసుకున్నారు.. పెద్దలూ అంగీకరించి, ఘనంగా వివాహం చేసేందుకూ సిద్ధమయ్యారు. కానీ విధి వారిపై పగబట్టింది. సోమవారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరూ కన్నుమూశారు. ఏపీలోని కడప జిల్లా పెనికెలపాడు గ్రామానికి చెందిన రైతు ప్రసాద్‌రెడ్డి పెద్ద కుమారుడు నిఖిల్‌రెడ్డి (33), ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం పుట్రాలకు శ్రీరమ్య (23) ఇద్దరూ సిగాచి పరిశ్రమలో పనిచేస్తూనే ప్రేమలో పడ్డారు. కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో తిరుపతిలో వివాహం చేసుకున్నారు. తర్వాత వారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివా్‌సరావును ఆశ్రయించగా.. ఇరువర్గాల పెద్దలతో మాట్లాడి నచ్చజెప్పారు. కొత్త వస్త్రాలు పెట్టి ఆశీర్వదించారు. ఆషాఢ మాసం వెళ్లిన తర్వాత ఘనంగా రిసెప్షన్‌ జరపాలని ఇరువురి కుటుంబాలు నిర్ణయించాయి. కానీ సుగాచి దుర్ఘటనలో ఇద్దరూ మృత్యువాతపడ్డారు. వారి ఆచూకీ కోసం ఎమ్మెల్యే శ్రీనివాసరావు స్వయంగా పరిశ్రమ వద్దకు వచ్చి వాకబు చేశారు. తమవారి మృతదేహాల కోసం ఇద్దరి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. నిజానికి రమ్యశ్రీ ఉదయం పది గంటలకు మొదలయ్యే షిఫ్టుకు వెళ్లాల్సి ఉందని, కానీ సోమవారం ఉదయం ఐదు గంటల షిఫ్టుకే హాజరైందని తోటి ఉద్యోగులు తెలిపారు. నిఖిల్‌ కూడా నైట్‌ షిఫ్టులోనే ఉన్నారని.. ప్రమాదంలో ఇద్దరూ కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు.


మూడు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరి..

33.jpg

పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన జస్టిన్‌ మూడు రోజుల క్రితమే సిగాచి పరిశ్రమలో ఉద్యోగంలో చేరారు. మంచి ఉద్యోగం దొరికిందని ఆ యువకుడి కుటుంబం ఎంతో సంతోషపడింది. కానీ ఆ ఆనందం ఆవిరైపోయింది. సోమవారం ఉదయం పరిశ్రమలో విధులకు వచ్చిన జస్టిన్‌ ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. ఆయన తండ్రి రామ్‌దాస్‌ తన కుమారుడి ఫొటో పట్టుకుని ఆచూకీ కోసం కన్నీళ్లతో వేడుకుంటున్నారు. సమీప బంధువు సహకారంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

ఎండీ ఎక్కడ?.. స్థానికుల ఆగ్రహం

పటాన్‌చెరు రూరల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సిగాచి పరిశ్రమలో ఇంత ఘోరం జరిగినా.. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిదంబర నాథ్‌ రెండు రోజులుగా అక్కడికి రాకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ఇప్పటిదాకా కేసు నమోదు చేయకపోవడం ఏంటని మండిపడుతున్నారు. అయితే.. 75 సంవత్సరాలకు పైగా వయసున్న ఎండీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. అందుకే ఆయన రాలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. స్థానిక ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ సరిగ్గా తనిఖీలు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదంటూ ఆయనపైన కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్‌ ప్లాంట్‌ పై అంతస్తులో క్యూసీ (నాణత్య తనిఖీ) విభాగాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉదయం 9 గంటల జనరల్‌ షిఫ్ట్‌కి వచ్చే సిబ్బందిలో ఎక్కువశాతం క్యూసీలో పనిచేసేవారే. వారికి ఉత్పత్తికి ఎలాంటి సంబంధమూ ఉండదు. కానీ.. ఈ ప్రమాదంలో ఎక్కువగా వారే చనిపోయారు. క్యూసీ సిబ్బంది అంతా బస్సు దిగి.. లోపలికి వెళ్లిన కొద్ది నిమిషాలకే ఈ భారీ పేలుడు చోటు చేసుకోవడంతో వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఇక.. ఈ పరిశ్రమలో ప్లాంట్‌ మేనేజర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన ఇలంగోవన్‌ (తమిళనాడువాసి) కేన్సర్‌బారిన పడటం మూణ్నెల్లుగా ఇంట్లోనే ఉంటున్నారు. రెండు రోజుల నుంచి మాత్రమే ఆయనకు విధులకు హాజరవుతున్నారు. అంతలోనే ఈ ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.


మృతుల కుటుంబాలకు రూ.లక్ష అందజేత

సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.లక్షను మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అంత్యక్రియలు, ఇతర అత్యవసర ఖర్చుల నిమిత్తం 11 మంది మృతుల కుటుంబాలకు నగదు సహాయం అందించి మృతదేహాలను అంబులెన్సులలో స్వస్థలాలకు తరలించారు. ఇది తక్షణ సహాయం మాత్రమే అని ప్రతి ఒక్క కార్మిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ చెప్పారు. మిగతా మృతదేహాలను గుర్తించి స్వస్థలాలకు పంపేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది: దామోదర

మియాపూర్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్‌ పేలిన ఘటనలో గాయపడిన కార్మికుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం ఆయన మియాపూర్‌ మదీనగూడలోని ప్రణామ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది క్షతగాత్రులను పరామర్శించారు. వారికి రూ.50 వేల చొప్పున సహాయం అందజేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కార్మికులతో పాటు అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా, ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన హేమంత్‌సుందర్‌ (45) ఇక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.


తమవాళ్లు బతికే ఉంటారని..

35.jpg

సంగారెడ్డి, జూలై 1 (ఆంఽధ్రజ్యోతి): సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 48 గంటలు గడిచిపోయింది! పని చోటు నుంచి ఇంటికి రాని కార్మికుల విషయంలో వారి కుటుంబాల్లో ఇంకా ఆశలు.. తమవాళ్లు బతికే ఉన్నారని, గాయాలతోనైనా ఇంటికి వస్తారని! పరిశ్రమ వద్ద తమవాళ్ల కోసం వారంతా వెతుకుతున్నారు. తమవాళ్లు ఇంటికి రాలేదని, వారి ఫోన్లు పనిచేయడం లేదని రోదిస్తున్నారు. అధికారుల వద్ద.. సురక్షితంగా ఉన్న కార్మికుల జాబితాలో బాధిత కుటుంబాలకు చెందిన కార్మికుల పేర్లు లేనట్లుగా తెలుస్తోంది. మార్చురీలో ఉన్న మృతదేహాలను ఓసారి చూడాలని అధికారులు చెబుతున్నా బాధితులు జంకుతున్నారు. ఆవైపు వెళ్లేందుకు వారు ధైర్యం చేయడం లేదు. పరిశ్రమలో ఎవరూ లేరని.. ఇక్కడ వెతికి ప్రయోజనం లేదని అధికారులు, పోలీసులు నచ్చజెబుతున్నా వారు అక్కడి నుంచి కదలడం లేదు. తమవాళ్లకు ఏంకాలేదని, బతికి ఉంటారనే ధీమాతో ఉన్నారు. కాగా పేలుడు ఘటనలో ఇప్పటివరకు 41 మంది చనిపోగా ఇప్పటి దాకా 13 మృతదేహాలనే గుర్తించారు. వాటిని బంధువులకు అప్పగించి.. స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. మృతులంతా 30 ఏళ్లలోపువారే. దాదాపు అంతా బయటరాష్ట్రాలకు చెందినవారే. ఇక్కడ ఒంటరిగా ఉంటే పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి బయట రాష్ట్రాల్లో ఉన్న కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమవారి ఆచూకీ కోసం వారు ఫోన్లు చేస్తున్నారు. స్పందన రాకపోవడంతో కొందరు ఇప్పటికే బయలుదేరారు. మరోవైపు.. పటాన్‌చెరు ఏరియాలోని 3 ఆస్పత్రుల్లో మరో 30 మంది చికిత్స పొందుతున్నారు. కొందరు మార్చురీకి వెళ్లి పరిశీలించి.. మృతదేహాలు తమవారివి కావంటూ బయటకు వెళ్లిపోతున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతా ఛిద్రమవడంతో డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.


నా భర్తను చూపించండి..

34.jpg

ఒడిశాకు చెందిన గర్భిణి పూజ మూడేళ్ల బాబును ఎత్తుకుని తిరుగుతూ, తన భర్త పాషాన్‌ ఆచూకీ చెప్పాలని కనబడిన వారినల్లా వేడుకుంటుండటం అందరినీ కలచి వేసింది. సోమవారం ఉదయం నుంచీ ఆమె అలా కన్నీళ్లతో తిరుగుతూనే ఉంది. మంగళవారం ఘటనా స్థలానికి సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ వచ్చిన సమయంలో ఆమెతోపాటు బాధిత కుటుంబాలవారు తమ బాధ మొరపెట్టుకున్నారు.

స్ర్పేయర్‌ డ్రయర్‌లో ఒత్తిడితోనే పేలుడు?

సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించడానికి.. భద్రతా నిర్వహణ లోపాలే కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. పరిశ్రమలోని స్ర్పేయర్‌ డ్రయర్‌లో అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించే సేఫ్టీవాల్వ్‌, బ్లోయర్‌ హ్యాండ్లర్‌ అనే పరికరాలు పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మైక్రోక్రిస్టల్‌ సెల్యులోజ్‌ డ్రయింగ్‌ యూనిట్‌ (ఎంసీసీ) డ్రయర్‌లో 700 నుంచి 800డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడుతుందని.. ఆ అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించే బ్లోయర్‌ హ్యాండ్లర్‌ పనిచేయకపోతే పేలుడు సంభవిస్తుందని రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో డ్రయర్‌ యూనిట్‌ వద్దే భారీగా ప్రాణనష్టం సంభవించగా.. పరిశ్రమలోని ఇతర రియాక్టర్లు చెక్కుచెదరలేదు.


ఇవి కూడా చదవండి:

ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ రాష్ట్రం

వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్

బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..

For More Telangana News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 05:39 AM