Share News

Yadadri: అర్ధరాత్రి.. అమానుషం

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:47 AM

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అమానుష ఘటన వెలుగుచూసింది. పట్టణానికి చెందిన గాయత్రి ఆస్పత్రిలో లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఇద్దరికి అబార్షన్లు చేసినట్లుగా సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు ఆస్పత్రిపై దాడులు చేశారు.

Yadadri: అర్ధరాత్రి.. అమానుషం

  • ఇద్దరికి గర్భవిచ్ఛిత్తి చేసిన వైద్యులు

  • ఆడపిల్లలు కాబట్టేఅబార్షన్లు

  • భువనగిరిలో ఐదుగురిపై కేసు నమోదు

భువనగిరి టౌన్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అమానుష ఘటన వెలుగుచూసింది. పట్టణానికి చెందిన గాయత్రి ఆస్పత్రిలో లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఇద్దరికి అబార్షన్లు చేసినట్లుగా సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు ఆస్పత్రిపై దాడులు చేశారు. అక్కడున్న డస్ట్‌ బిన్‌లో మృత శిశువుల పిండాలను గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రమే్‌షకుమార్‌ తెలిపారు. ఆసుపత్రి నిర్వాహకులైన హిరేకార్‌ శివకుమార్‌, అతని భార్య గాయత్రి, ల్యాబ్‌ నిర్వాహకుడు దంతూరి పాం డు గౌడ్‌తో పాటు అబార్షన్లు చేయించుకున్న ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శివకుమార్‌ను, దంతూరి పాండుగౌడ్‌ను సోమవారం రాత్రి భువనగిరి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. వైద్యుడికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా, ల్యాబ్‌ నిర్వాహకునికి బెయిల్‌పై విడుదలయ్యాడు.


ఎస్‌వోటీ పోలీసుల సమాచారం మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం ఆస్పత్రి, ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి, ల్యాబ్‌ నిర్వహణ ఉందని ప్రాథమికంగా తేల్చారు. ల్యాబ్‌ను పోలీసులు సీజ్‌ చేయగా.. ఆస్పత్రి, ల్యాబ్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పూర్తిస్థాయి దర్యాప్తు జరిగాక తదుపరి చర్యలుంటాయని తెలిపారు. భువనగిరి మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఆడ పిల్లలే పుడతారని ల్యాబ్‌ నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్ష ద్వారా నిర్ధారించారు. ఇద్దరికీ 5 నెలలు కాగా, ఆడపిల్లలు వద్దనుకుని గాయత్రి ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. దీంతో ఆ ఇద్దరికి ఆదివారం అర్ధరాత్రి దాటాక వైద్యులు గర్భవిచ్ఛిత్తి చేశారు. ఒక్కో అబార్షన్‌కు రూ.46 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.


అప్పుడు ‘స్వాతి’... ఇప్పుడు గాయత్రి ఆస్పత్రి

గాయత్రి ఆస్పత్రి నిర్వాహకులైన దంపతులు శివ, గాయత్రి విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. నిబంధనల ప్రకారం వారు భారత్‌లో నిర్వహించే ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే వైద్యవృత్తి చేయడానికి, ఎంబీబీఎస్‌ విద్యార్హతను పేర్కొనడానికి అర్హులు. కానీ ఇవేమీ లేకుండానే స్వాతి ఆస్పత్రి పేరిట తొలుత రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అయితే ఆ ఆస్పత్రిలో చేసిన శస్త్రచికిత్సలతో వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు మహిళలు మృతి చెందడంతో అధికారులు దాన్ని సీజ్‌ చేశారు. అయితే అదే ఆస్పత్రిని గాయత్రిగా మార్చి ఇదే తరహా వ్యవహారం కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 04:47 AM