RTC Bus Accident: మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:59 AM
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది.
రంగారెడ్డి, నవంబర్ 7: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు (Bus Accidents) తీవ్ర కలకలం రేపుతున్నాయి. రోజుకో చోట ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏదో ఒక ప్రాంతంలో బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీని బస్సును డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఈరోజు (శుక్రవారం) రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఒక్కసారిగా డీసీఎం ఢీకొట్టడంతో బస్సులోని ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సును డీసీఎం ఢీకొట్టిన వెంటనే భారీ శబ్ధం వచ్చింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బస్సులోని ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీఎం అతి వేగంగా వచ్చి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్
ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
Read Latest Telangana News And Telugu News