Vande Mataram: వందేమాతర గీతానికి నేటికి 150 ఏళ్లు.. పులకిస్తోన్న భారతదేశం
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:37 AM
భారతదేశ స్వాతంత్య్ర సమరంలో జాతిని జాగృతం చేసిన ‘వందేమాతరం’ గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయి. ఈ వేడుక సందర్భంగా జాతీయోద్యమ మహనీయులకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు..
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశ స్వాతంత్య్ర సమరంలో జాతిని జాగృతం చేసిన ‘వందేమాతరం’ గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయి. ఈ వేడుక సందర్భంగా జాతీయోద్యమ మహనీయులకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సందేశాలు ఇస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయోద్యమ మహనీయులకు ఘన నివాళులర్పించారు. వందేమాతరం.. జాతీయ గీతం స్ఫూర్తిగా, సమైక్యతా భావంతో దేశ అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా మహనీయుల్ని స్మరించుకున్నారు. వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనదేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ రణ నినాదంలా నిలిచింది వందేమాతరం. శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ గారు రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించింది. స్వతంత్ర సమరయోధులకు మనో బలాన్ని ఇచ్చింది.
బ్రిటిషర్లను అప్పట్లో వందేమాతరం అనే మాటే భయపెట్టింది. భారతీయుల నోట మంత్రంలా మారిన వందేమాతరాన్ని పలికితే జైళ్ల పాల్జేశారు. ఈ రోజుకీ వందేమాతరం ఆలపించినా, విన్నా నరనరాన దేశభక్తి నిండుతుంది. ఒళ్ళు పులకరిస్తుంది.
శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ గారు మన జాతికి అందించిన ఆ గేయంలో ఉన్న శక్తి అది. పోరాట స్ఫూర్తిని నింపిన వందేమాతరం గురించి భావి తరాలకు ఘనంగా తెలియచేయాలి. ఈ గేయం నేటికి (శుక్రవారం) 150 ఏళ్ళు పూర్తి చేసుకొంటుంది.
దేశవ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ వందేమాతరం ఆలపించాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఉదయం 10 గం. ప్రతి ఒక్కరం వందేమాతర గేయాన్ని ఆలపిద్దాము. వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనందరిదీ జైహింద్' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:
Investigation of defecting MLAs: ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
Updated Date - Nov 07 , 2025 | 09:24 AM