Private Colleges: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ట్రస్ట్ బ్యాంక్!
ABN , Publish Date - Jul 03 , 2025 | 03:28 AM
ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏటేటా పెరిగిపోతుండడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కాలేజీల యాజమాన్యాలే ఫీజు చెల్లింపునకు పరిష్కార మార్గాన్ని సర్కారుకు సూచించాయి.

ఉన్నత విద్యారంగం టర్నోవర్ 65 వేల కోట్లు
దానిపై వచ్చే వడ్డీతో ఫీజు చెల్లించండి
ప్రభుత్వ ఖజానాపై భారం పడదు
తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య ప్రతిపాదన
సానుకూలంగా స్పందించిన భట్టి
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏటేటా పెరిగిపోతుండడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కాలేజీల యాజమాన్యాలే ఫీజు చెల్లింపునకు పరిష్కార మార్గాన్ని సర్కారుకు సూచించాయి. మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లించలేమని ప్రభుత్వం ఇప్పటికే చెప్పడంతో.. కొత్త ప్రతిపాదనతో సర్కారును సంప్రదించాయి. ప్రభుత్వంపై భారం పడకుండా ప్రతి ఏటా రీయింబర్స్‌మెంట్ చెల్లించేలా కొత్త విధానాన్ని ప్రతిపాదించాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలన్నింటి ఆర్థిక లావాదేవీలకు కలిపి ట్రస్టు బ్యాంకును ఏర్పాటు చేసి.. దాని ద్వారా ఫీజు చెల్లింపు చేయవచ్చని పేర్కొన్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యారంగం పరిధిలో వందలాది విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, లా, మేనేజ్‌మెంట్, డిగ్రీ కాలేజీలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి.
వీటిలో వేలాది మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా.. తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల వార్షిక టర్నోవర్ రూ.65 వేల కోట్లకు పైగా ఉంది. ప్రభుత్వం సైతం ఈ రంగానికి ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.వేల కోట్లు కేటాయిస్తుంది. ఈ మొత్తానికి కలిపి ట్రస్ట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని కాలేజీల యాజమాన్యాలు ప్రతిపాదించాయి. ఫీజు బకాయిలు సాధించుకోవడమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల సంఘాలన్నీ కలిసి ఇటీవలే తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్యగా ఏర్పడ్డాయి. బుధవారం సమాఖ్య అధ్యక్షుడు, అరోరా విద్యాసంస్థల చైర్మన్ నిమ్మటూరి రమేశ్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కను సచివాలయంలో కలిసి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ఆయన ముందుంచింది.
కాలేజీల యాజమాన్యాల ప్రతిపాదన ఇదీ..
ట్రస్ట్ బ్యాంక్ విధానాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సైతం 2001 జనవరిలో అనుమతించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ట్రస్టును నెలకొల్పి.. దాని ఆద్వర్యంలో ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తొలుత ప్రభుత్వం తన మూలధన వాటాగా ఒకేసారి రూ.1500 కోట్లు అందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు విద్యాసంస్థల ఆపరేషన్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.2500 కోట్లు సేకరించవచ్చు. ప్రభుత్వ వర్సిటీలు, విద్యాసంస్థల కరంట్ ఆపరేషనల్ అకౌంట్ వడ్డీ రూ.1000 కోట్లు, హాస్టళ్ల కరంట్ ఆపరేషనల్ డిపాజిట్లపై రూ.300 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా లబ్ధి పొంది ఉద్యోగాలు పొందినవారి నుంచి విరాళాల సేకరణతో రూ.525 కోట్లు, ఇతర వ్యాపార సంస్థలపై నామమాత్ర సెస్ విధించడం ద్వారా ఏటా రూ.375 కోట్లు సేకరించవచ్చు.
ఇవే కాకుండా.. విద్యాసంస్థల నుంచి కార్పస్ ఫండ్ రూపంలో రూ.389 కోట్లు, ఉన్నత విద్య హాస్టళ్లు, స్టడీ సెంటర్లు, క్యాంపస్ సెంటర్ల కార్పస్ ఫండ్ రూ.100 కోట్లు, రాష్ట్ర, కేంద్ర విద్యాసంస్థల రిజర్వ్ ఫండ్ రూ.336 కోట్లు సేకరించవచ్చని సమాఖ్య ప్రతిపాదించింది. ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం ప్రభుత్వం రూ.2500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా.. గత మూడేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు రూ.7500 కోట్లకు చేరాయి. వచ్చే ఏడాదికి రూ.10 వేల కోట్లకు చేరతాయి. అయితే ట్రస్టు బ్యాంకు ద్వారా సుమారు రూ.3 వేల కోట్ల వరకు సమీకరించవచ్చని సమాఖ్య తెలిపింది. అప్పుడు ప్రభుత్వం పైసా చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. కళాశాలల సమాఖ్య చేసిన ఈ ప్రతిపాదనను ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆసక్తిగా విన్నారు. ఉన్నత విద్యారంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, కానీ.. ఆర్థిక సమస్యల కారణంగానే బకాయిల విడుదలలో ఆలస్యం అవుతోందని చెప్పారు. సమాఖ్య చేసిన ట్రస్ట్ బ్యాంకు ప్రతిపాదనపై ఈ నెల 7న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి చర్చిస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి