Share News

రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:22 AM

తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి (52) హత్య.. రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్య వెనుక బీఆర్‌ఎస్‌ నేతలు, కేసీఆర్‌ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది.

రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం

  • బీఆర్‌ఎస్‌ నేతలు, కేసీఆర్‌ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య

  • మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అరెస్టు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి

  • హత్యతో నాకు, బీఆర్‌ఎ్‌సకు సంబంధం లేదు: వెంకటరమణారెడ్డి

  • సీఐడీతో విచారణ జరిపించాలంటూఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండ్‌

  • కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్‌ ఆరా

  • పోలీసుల అదుపులో ముగ్గురు.. తామే చంపినట్టు అంగీకారం?.. పరారీలో ఇద్దరు

భూపాలపల్లి/కృష్ణకాలనీ/బాలసముద్రం/హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి (52) హత్య.. రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్య వెనుక బీఆర్‌ఎస్‌ నేతలు, కేసీఆర్‌ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసులు వేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఏడో బ్లాకు కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ప్రాజెక్టు ఇంజనీర్లపైనా కోర్టులో పిటిషన్‌ దాఖలు వేయడం కూడా ఆరోపణలకు కారణమైంది. బీఆర్‌ఎస్‌ నేతల దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేస్తారా? అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ ఘటనపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని అన్నారు. రాజలింగమూర్తిని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డే హత్య చేయించారని, దీని వెనుక కేసీఆర్‌, హరీశ్‌రావు ఉన్నారని మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఘటన వెనుక ఎంత పెద్ద వారున్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా, రాజలింగమూర్తి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. దీనిపై ప్రభుత్వం సీబీసీఐడీ విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చాలని కోరారు. హత్య చేసిన వ్యక్తులు లొంగిపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు.


హత్యారాజకీయాలను బీఆర్‌ఎస్‌ ప్రోత్సహించదు:వెంకటరమణారెడ్డి

రాజలింగమూర్తి హత్యతో తనకుగానీ, బీఆర్‌ఎస్‌ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. హత్యా రాజకీయాలను బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ప్రోత్సహించదన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని, తానే చేయించానంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. మేడిగడ్డ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, హత్యకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఘటనపై సీఐడీ, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మృతుడి భార్య బీఆర్‌ఎస్‌ తరఫున కౌన్సిలర్‌గా గెలిచారని, వారి విధానాలు నచ్చకపోవడంతో పార్టీ దూరం పెట్టిందని తెలిపారు. ఆమెతో కొందరు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. రాజలింగమూర్తి అనేక భూ వివాదాల్లో కూరుకుపోయాడని, గతంలో రౌడీషీటర్‌ అని చెప్పారు. ఆయన హత్యకు భూవివాదాలే కారణమై ఉండొచ్చన్నారు. ఇదిలా ఉండగా.. మృతుడి భార్య సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. భూపాలపల్లి పట్టణంలోని ఓ భూమికి సంబంధించి రేణికుంట్ల కొమురయ్య, రేణికుంట్ల సంజీవ్‌ కుటుంబాలతో తమకు గొడవ జరుగుతోందని తెలిపారు. దీనిపై కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చేలా ఉందని భావించి తన భర్తను హత్య చేశారని పేర్కొన్నారు. అయితే వీరిని రాజకీయంగా ప్రేరేపించి ఉంటారని, బీఆర్‌ఎస్‌ నేతలు, కేసీఆర్‌ కుటుంబ హస్తం ఉందని ఆరోపించారు. మరోవైపు సీఎంగా, హోంమంత్రిగా రేవంత్‌ విఫలమయ్యారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. హోం మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


పోలీసులకు లొంగిపోయిన ఇద్దరు?

రాజలింగమూర్తిని తామే హత్య చేశామంటూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. మరొకరిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు డీఎస్పీ సంపత్‌రావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఇంటెలిజెన్స్‌ ద్వారా హత్యపై సమాచారం తీసుకున్నట్టు పోలీస్‌ వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాయి. కేసు దర్యాప్తును ఎస్పీ కిరణ్‌ఖరే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విచారణలో భూ వివాదాలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరోవైపు రాజలింగమూర్తి మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి.


హత్య ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం

  • అందుకే కృష్ణాజలాలపై మాట్లాడుతున్న హరీశ్‌: కోమటిరెడ్డి

సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్య చేయించిన గండ్ర వెంకటరమణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి పోలీసులకు లొంగిపోవాల్సిందిగా ఆదేశించడానికి బదులు.. ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కృష్ణా నీటి కేటాయింపుల అంశంపై హరీశ్‌రావు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలను ఎండబెట్టి.. వైఎస్‌ జగన్‌ను వెంట పెట్టుకుని కృష్ణా నీటిలో ఏపీకి వాటా రాసిచ్చిందే కేసీఆర్‌ అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు న్యాయవాది వామనరావు దంపతులను నడి రోడ్డుపై హత్య చేయించిన వ్యక్తికి కేసీఆర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారని, ఆ వ్యక్తి అప్పట్లో శ్రీధర్‌బాబును కూడా హత్య చేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. లగచర్లలో కలెక్టర్‌పై బీఆర్‌ఎ్‌సకు చెందిన సురేష్‌ అనే రౌడీ షీటర్‌ దాడి చేశారనీ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ తగ్గిందంటున్న కేసీఆర్‌.. ఏదైనా ఊరికి వెళ్లి కనుక్కున్నారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాలో జరిగిన అవినీతిపై కేసులు వేసినవారు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే.. వారికి రక్షణ కల్పిస్తామన్నారు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?

Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక

Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..

Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు

Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం

For Telangana News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 04:22 AM