Share News

Phone Tapping Case: ట్యాపింగ్‌కు అనుమతించారా?

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:18 AM

అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలకమైన ఉన్నతాధికారుల నుంచి సిట్‌ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు.

Phone Tapping Case: ట్యాపింగ్‌కు అనుమతించారా?

  • ఎస్‌ఐబీ ఇచ్చిన ఫోన్‌ నంబర్ల జాబితాను పరిశీలించారా?

  • డీజీపీ జితేందర్‌, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ అనిల్‌కుమార్‌కు సిట్‌ ప్రశ్నలు

  • ఎస్‌ఐబీ చీఫ్‌ హోదాలో ప్రభాకర్‌రావు లేఖతోనే అనుమతిచ్చామన్న ఉన్నతాధికారులు

  • ప్రభాకర్‌రావు బృందం తప్పుడు సమాచారంతో ట్యాపింగ్‌ కోసం అనుమతిపొందినట్టు నిర్ధారణ

  • మరోసారి ప్రణీత్‌రావు విచారణ ట్యాపింగ్‌ బాధితుల వాంగ్మూలాలు నమోదు

  • ట్యాపింగ్‌ బాధితుల్లో వైఎస్‌ షర్మిలతోపాటు పలువురు వైసీపీ నేతలు

  • 22న ప్రభాకర్‌రావును విచారించనున్న సిట్‌ ముగ్గురు బీజేపీ ఎంపీల వాంగ్మూలాల కోసం

  • సిట్‌ అధికారుల యత్నం

హైదరాబాద్‌/మల్కాజిగిరి/నార్సింగ్‌/వికారాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలకమైన ఉన్నతాధికారుల నుంచి సిట్‌ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు. ఉప ఎన్నికల సమయంలో, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని ఎస్‌ఐబీ బృందం ట్యాపింగ్‌ కోసం సుమారు 618 ఫోన్‌ నంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టి, అనుమతి తీసుకున్నట్టు సిట్‌ గుర్తించింది. దీంతో ఆ రివ్యూ కమిటీ సభ్యులు అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్‌, అప్పటి ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ అనిల్‌కుమార్‌కు సిట్‌ అధికారులు కొన్ని ప్రశ్నలతో కూడిన లేఖను పంపి, సమాధానాలు రాబట్టారు. ‘ఎస్‌ఐబీ నుంచి వచ్చిన ఫోన్‌ నంబర్లపై మీరు పరిశీలన (వెరిఫై) చేస్తారా? అలాంటి యంత్రాంగం ఏదైనా ఉందా? ఫోన్లను ట్యాప్‌ చేసిన తర్వాత రివ్యూ కమిటీ అనుమతి కోరారా? ముందే అనుమతి తీసుకున్నారా? ఆ ఫోన్‌ నంబర్లన్నీ మావోయిస్టులు, ఉగ్రవాద ఆపరేషన్ల కేసులకు సంబంధించినవని నోట్‌లో పేర్కొన్నారా?’ తదితర అంశాలపై సమాధానాలు తీసుకున్నట్టు తెలిసింది. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్‌ హోదాలో అధీకృత అధికారి కావడంతో.. ఆ విభాగం నుంచి వచ్చిన లేఖలకు అనుమతి ఇచ్చామని జితేందర్‌, అనిల్‌కుమార్‌ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఇక మాజీ డీజీపీలు మహేందర్‌రెడ్డి, అంజనీకుమార్‌, ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాలకు కూడా ప్రశ్నావళి పంపేందుకు సిట్‌ అధికారులు సిద్ధమైనట్టు తెలిసింది. నాటి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నుంచి కూడా సమాచారాన్ని సేకరించాలని భావిస్తున్నట్టు సమాచారం.


షర్మిల, వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌..

తెలంగాణ పోలీసులు తన అన్న జగన్‌ కోసం.. తన ఫోన్‌ను, తన భర్త అనిల్‌కుమార్‌, పలువురు వైసీపీ నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేశారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. అయితే ప్రభాకర్‌రావు బృందం షర్మిలతోపాటు వైసీపీ నాయకులు కాసు మహేశ్‌రెడ్డి, కోటంరెడ్డి వినయ్‌కుమార్‌రెడ్డి ఫోన్లను ట్యాప్‌ చేసినట్టుగా సిట్‌ తేల్చినట్టు సమాచారం. రివ్యూ కమిటీకి అధికారికంగా తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు ఎలాంటి అనుమతులు లేకుండా వేల మందిపై నిఘా కొనసాగించిందని గుర్తించినట్టు తెలిసింది. టెలికాం సర్వీసు ప్రొవైడర్ల వాంగ్మూలాలను సైతం సిట్‌ అధికారులు నమోదు చేసినట్టు సమాచారం.

మరికొందరి వాంగ్మూలాల నమోదు..

మరోవైపు సిట్‌ మరికొందరు ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుల వాంగ్మూలాలను బుధవారం నమోదు చేసింది. సీఎం రేవంత్‌ ముఖ్య అనుచరుడు, టీపీసీసీ అఽధికార ప్రతినిధి ముంగి జైపాల్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్‌రెడ్డి డ్రైవర్‌ జగదీశ్వర్‌, పొలిటికల్‌ స్ట్రాటజిస్టు గుండ్లపల్లి సైదులుతోపాటు గాంధీభవన్‌కు చెందిన కొందరు ఉద్యోగుల వాంగ్మూలాలను సిట్‌ అధికారులు నమోదు చేశారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌తోపాటు ముగ్గురు ప్రధాన అనుచరులు ప్రేమ్‌కుమార్‌, గుండా నిరంజన్‌, కపిల్‌ల ఫోన్లు సైతం ట్యాప్‌ అయినట్టు సిట్‌ గుర్తించింది. దీనికి సంబంధించి నిరంజన్‌ నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై పోలీసు నిఘా ఉందని గుర్తించిన పట్లోళ్ల మహిపాల్‌రెడ్డి.. తన డ్రైవర్‌ జగదీశ్వర్‌ ఫోన్‌ నుంచి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సునీల్‌ కనుగోలు, పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిలతో మాట్లాడారు. కానీ ప్రభాకర్‌రావు బృందం జగదీశ్వర్‌ ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేసినట్టుగా సిట్‌ అధికారులు గుర్తించారు. ఇక ముగ్గురు బీజేపీ ఎంపీల వాంగ్మూలం కోసం కూడా సిట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బాధితుల్లో చాలామంది ప్రముఖులు సిట్‌ విచారణకు సహకరించడం లేదని.. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు వాంగ్మూలాలు ఎందుకని పేర్కొంటున్నట్టు తెలిసింది. ఇలా వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించినవారిలో సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్టు సమాచారం.


ప్రణీత్‌రావును ప్రశ్నించిన అధికారులు

ట్యాపింగ్‌ చేసిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌కు బాస్‌గా వ్యవహరించిన ప్రణీత్‌రావును సిట్‌ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ నెల 22న ప్రభాకర్‌రావును మరోసారి విచారించనున్న నేపఽథ్యంలో కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ప్రణీత్‌రావును ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిచ్చి అనుమతులు పొందిన వైనంపై ఈసారి విచారణలో ప్రభాకర్‌రావును ప్రశ్నించాలని సిట్‌ భావిస్తున్నట్టు సమాచారం.


ట్యాపింగ్‌ ముమ్మాటికీ నిజం

  • నా ఫోన్‌ రికార్డు ఆడియోను అప్పట్లో వైవీ వినిపించారు :షర్మిల

విశాఖపట్నం: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌లు జరిగిన మాట ముమ్మాటికీ వాస్తవమేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అల్లూరి జిల్లా పర్యటన నిమిత్తం బుధవారం హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన ఆమె విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి, రికార్డు చేసిన ఆడియోను వైవీ సుబ్బారెడ్డి స్వయంగా తనకు వినిపించారని తెలిపారు. అయితే తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి చేసిన అరాచకాలకంటే ట్యాపింగ్‌ చిన్నదిగా అనిపించడంతో ఆ సమయంలో ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కేటీఆర్‌, కేసీఆర్‌తో జగన్‌కు ఉన్న సంబంఽధం ముందు రక్తసంబంధం కూడా చిన్నబోయిందని ఆమె ఎద్దేవా చేశారు. తనను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగనీయకుండా, భవిష్యత్తును నాశనం చేసేందుకు జగన్‌ ఎన్నో కుట్రలు చేశారని, అందులో ఫోన్‌ట్యాపింగ్‌ కూడా భాగమేనని షర్మిల పేర్కొన్నారు. చెల్లి విషయంలో ఏ అన్నా చేయనన్నిఘోరాలు నా విషయంలో జగన్‌ చేశారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలో జగన్‌కు సంబంధం లేకపోయినా తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తనకు జగన్‌తో వ్యక్తిగత కక్షలు ఉండి ఉంటే, ఎంవోయూ రాసిచ్చి, వాటిని అమలుచేయడం లేదని అప్పుడే ఫిర్యాదు చేసేదాన్నని, సొంత తల్లినే కోర్టుకు ఈడ్చిన వ్యక్తి జగన్‌ అని ఆమె విమర్శించారు. ట్యాపింగ్‌ వ్యవహారంపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఎటువంటి విచారణకు పిలిచినా హాజరవుతానని స్పష్టం చేశారు.

Updated Date - Jun 19 , 2025 | 03:18 AM