Share News

Kamareddy Cyber Fraud: వాట్సప్‌‌కు వచ్చిన లింక్‌ను ఓపెన్‌ చేసిన వ్యక్తికి ఊహించని షాక్

ABN , Publish Date - Nov 20 , 2025 | 10:52 AM

వాట్సప్‌లో వచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.6 లక్షల నగదును పోగొట్టుకున్నాడు.

Kamareddy Cyber Fraud: వాట్సప్‌‌కు వచ్చిన లింక్‌ను ఓపెన్‌ చేసిన వ్యక్తికి ఊహించని షాక్
Kamareddy Cyber Fraud

కామారెడ్డి, నవంబర్ 20: ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. మాయ మాటలతో ప్రజలను సైబర్ కేటుగాళ్లు ఈజీగా మోసం చేస్తున్నారు. వాళ్ల వలకు చిక్కి ఎంతో మంది పెద్ద మొత్తం డబ్బులు పోగొట్టుకుంటున్న పరిస్థితి. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఏదో విధంగా సైబర్ కేటుగాళ్ల వలలో అమాయక ప్రజలు చిక్కుతూనే ఉన్నారు.. లక్షల్లో నగదును పోగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక్క క్లిక్‌తో బాధితుడు లక్షల్లో మోసపోయాడు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.


జిల్లాలోని బీబీపేటలో సైబర్ మోసం జరిగింది. వాట్సప్‌కు వచ్చిన లింకులను ఓ వ్యక్తి ఓపెన్ చేశాడు. ఈ క్రమంలో దాదాపు రూ. 6 లక్షల నగదను కోల్పోవాల్సి వచ్చింది. సదరు వ్యక్తి నుంచి భారీ నగదును సైబర్ మోసగాళ్లు లాక్కున్నారు. బాధితుడికి కొద్ది రోజుల క్రితం అమెజాన్ నుంచి వచ్చినట్టుగా ఓ లింక్‌ను సైబర్ నేరగాళ్లు పంపారు. లింక్‌ను ఓపెన్ చేసి టాస్క్‌లను పూర్తి చేస్తే రూ.5.49 లక్షలు లాభం వస్తాయని కేటుగాళ్లు నమ్మబలికారు. పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశపడిన ఆ వ్యక్తి ఉన్న సొమ్ము పోతుందని ఊహించలేకపోయాడు. సైబర్ మోసగాళ్లు చెప్పిన విధంగా లింక్‌లు ఓపెన్ చేసి టాస్క్‌లు పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇలా విడతల వారీగా సుమారు రూ.6 లక్షల నగదును బాధితుడు పంపించాడు.


చివరకు అదనంగా డబ్బులు రాకపోగా.. ఉన్నది కూడా పోగొట్టుకోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడిన ఫిర్యాదు మేరకు బీబీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఫోన్లకు వచ్చిన లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని... మోసపోవద్దని పోలీసులు సూచించారు.


ఇవి కూడా చదవండి..

లెక్కే లేదు... అమలు ఇంకెక్కడ...

రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2025 | 12:20 PM