Share News

Hyderabad: తెరపైకి కొత్త ‘బొమ్మ’లు.. వెలుగులోకి మరిన్ని పైరసీ ముఠాలు

ABN , Publish Date - Nov 20 , 2025 | 10:42 AM

కాపీ రైట్‌ రక్షణ పొందిన సినిమాలను పైరసీ చేసి.. డిజిటల్‌ మీడియాను హ్యాక్‌ చేసి వివిధ వెబ్‌సైట్ల ద్వారా వాటిని పంపిణీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి రూ.వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ముఠాల ఆట కటిస్తున్నారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

Hyderabad: తెరపైకి కొత్త ‘బొమ్మ’లు.. వెలుగులోకి మరిన్ని పైరసీ ముఠాలు

- చెలరేగిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

- విదేశీ ఐపీఅడ్రస్ లతో వెబ్‌సైట్లు

- అతిపెద్ద ముప్పుగా క్యామ్‌ రికార్డింగ్‌

- 500 సినిమాలు పైరసీ చేసిన అశ్వనీకుమార్‌

- 2000 సినిమాలతో ఐ బొమ్మ రవి రికార్డు

- పైరసీలతో ఇండస్ట్రీకి రూ.వేల కోట్ల నష్టం

హైదరాబాద్‌ సిటీ: కాపీ రైట్‌ రక్షణ పొందిన సినిమాలను పైరసీ చేసి.. డిజిటల్‌ మీడియాను హ్యాక్‌ చేసి వివిధ వెబ్‌సైట్ల ద్వారా వాటిని పంపిణీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి రూ.వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ముఠాల ఆట కటిస్తున్నారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. నెల రోజుల క్రితం బిహార్‌(Bihar)కు చెందిన అశ్వనికుమార్‌ ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. తాజాగా ఐ బొమ్మ పేరుతో సినిమా పైరసీకి పాల్పడుతున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని కొత్త ముఠాలు ఉన్నాయని విచారణలో పోలీసులు గుర్తిస్తున్నారు. వాటిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.


హైదరాబాద్‌లోనే 100 సినిమాల పైరసీ

అశ్వనీకుమార్‌ ముఠాలో బిహార్‌కు చెందిన అర్సలాన్‌ అహ్మద్‌, తమిళనాడుకు చెందిన సిరిల్‌ ఇన్సంట్‌రాజ్‌, సుధాకరణ్‌, ఏపీకి అమలాపురానికి చెందిన జాన్‌ కిరణ్‌కుమార్‌ ఉన్నారు. ఈ ముఠా సభ్యులు 2020 నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్‌తో పాటు..

దేశవాప్తంగా వివిధ భాషలకు చెందిన సుమారు 500 చిత్రాలను పైరసీ చేశారు. లక్ష డాలర్ల వరకు (రూ. 90 లక్షలు) సంపాదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దేశంలోని వివిధ ఇండస్ట్రీలకు కలిపి మొత్త రూ. 22,400 కోట్లు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.


ఒక్క తెలుగు ఇండస్ట్రీకే రూ.3,700 కోట్లు నష్టం వాటిల్లినట్లు లెక్కలు తేల్చారు. నిందితులు పైరసీ చేసిన సినిమాల్లో హిట్‌, ది థర్డ్‌కేస్‌, సింగిల్‌, కుబేరా, హరి హర వీరమల్లు ఉన్నాయన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 100 సినిమాల వరకు రికార్డు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అశ్వనీకుమార్‌ హ్యాకింగ్‌ నిపుణుడుగా పోలీసులు గుర్తించారు. 1ఎక్స్‌బెట్‌, 4రాబెట్‌, రాజ్‌బెట్‌, పరిమాటెక్‌ వంటి బెట్టింగ్‌, గేమింగ్‌, టెలీగ్రామ్‌ చానళ్ల ద్వారా పైరసీ కాపీలను విడుదల చేసేవాడు.


city3.2.jpg

మరిన్ని ముఠాలు

తాజాగా అరెస్టయిన ఇమ్మడి రవి.. ఐ బొమ్మ పేరుతో సుమారు 2వేల సినిమాలు తన వెబ్‌సైట్లో చేర్చినట్లు పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా ఇతర దేశాల్లో ఉంటున్న రవి.. సినిమా పైరసీకి పాల్పడుతూ రూ.కోట్లు గడించాడు. సుమారు 50లక్షల మంది డేటాను సేకరించిన ఆయన ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టానికి కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. కేవలం అశ్వనికుమార్‌, ఇమ్మడి రవి ముఠాలే కాకుండా మరికొన్ని ఉన్నాయన్న సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్‌ లొకేషన్లను నెదర్లాండ్స్‌, పారిస్‌ వంటి దేశాలకు మారుస్తూ దందా చేస్తున్న కొత్త ముఠాలను కూడా పట్టుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి క్యామ్‌ రికార్డింగ్‌ అతిపెద్ద ముప్పు అని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. హోస్టింగ్‌ కంపెనీలు, ఐఎ్‌సపీలు, డిజిటల్‌ పైరసీకి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మూగబోయిన మావోయిస్టుల కంచుకోట!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 20 , 2025 | 10:42 AM