Share News

Kiran Kumar Reddy: కేటీఆర్‌ సన్నిహితుడు కేదార్‌ మృతిపై మౌనమెందుకు?

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:05 AM

కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కేదార్‌ మృతిపై మౌనమెందుకని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు.

Kiran Kumar Reddy: కేటీఆర్‌ సన్నిహితుడు కేదార్‌ మృతిపై మౌనమెందుకు?

  • విచారణ ఎందుకు కోరట్లేదు?.. ఎమ్మెల్సీ

  • కవితను ప్రశ్నించిన కాంగ్రెస్‌ ఎంపీ చామల

  • కేదార్‌తో అంటకాగిన వ్యక్తులెవరో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తేల్చాలి: యెన్నం

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కేదార్‌ మృతిపై మౌనమెందుకని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయానికి స్పందించే కేటీఆర్‌, కవిత, బీఆర్‌ఎస్‌ పరివారం కేదార్‌ మృతిపై మాత్రం మౌనంగా ఉంటోందని.. దీనిపై విచారణ ఎందుకు కోరడం లేదని గురువారం ఓ ప్రకటనలో నిలదీశారు. ఇది పలు సందేహాలకు తావిస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు పదేళ్ల పాటు తెలంగాణలో రూ.వేల కోట్లు దండుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టారన్న సంగతి ప్రజలకు తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌, బీజేపీ ఒక జట్టు అని కవిత మాట్లాడుతున్నరు. ఎవరు ఎవరితో జట్టు కట్టారో ఎమ్మెల్సీ ఎన్నికలతోనే తేలిపోయింది. రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలవడానికి ఎవరు సహకరించారు.. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకుండా అంతర్గతంగా ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చారన్నది ప్రజలు గమనిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కలిసినప్పుడు.. అక్కడ మూడో వ్యక్తి లేడని, వారు ఏం మాట్లాడుకున్నారన్నది కవితకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆమె కాకమ్మ కథలు మానేస్తే మంచిదని హితవు పలికారు. ‘2015 నుంచి.. చనిపోయేంత వరకు కేదార్‌తో అంటకాగిన వ్యక్తులు ఎవరు? దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలి’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి కోరారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌ కేసులో నిందితుడైన కేదార్‌.. గతంలో జూబ్లీహిల్స్‌లో పబ్‌లను నిర్వహించారని, ఆ పబ్‌లలో పలువురు రాజకీయ ప్రముఖుల భాగస్వామ్యమూ ఉందని చెప్పారు.


గత ఐదేళ్లలో తెలంగాణలో అక్రమంగా సంపాదించిన రూ.వేల కోట్ల సంపద.. దుబాయ్‌లో పెట్టుబడులుగా మారాయని, వాటికి కేదార్‌ సహా మరికొందరు బినామీలుగా ఉన్నారని ఆరోపించారు. వారు ఎవరెవరికి బినామీలుగా ఉన్నారు.. వెళ్లిన సంపద చట్టబద్ధంగా వెళ్లిందా.. లేక హవాలా రూపంలో వెళ్లిందా అన్నది దర్యాప్తు సంస్థలు తేల్చాలన్నారు. సినీ ప్రముఖులు.. వారు సంపాదించిన సొమ్మును ఎవరెవరినో నమ్మి విదేశాల్లో పెట్టుబడులు పెడితే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదన్నారు. సంపాదించిన సొమ్ములో కొంత సాయం చేసి.. ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు. బీఆర్‌ఎస్‌ నేతల పాపాలపై పోరాటం చేస్తున్నవారు వరుసగా చనిపోతున్నారని, రానున్న రోజుల్లో ఈ మరణాలకు కారణాలు బయటికి వస్తాయని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కేదార్‌ మృతిపై కేటీఆర్‌ ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. కేదార్‌ చనిపోయినప్పుడు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే, కేటీఆర్‌ నమ్మిన బంటు అక్కడే ఉన్నాడన్నది నిజమా కాదా అని ప్రశ్నించారు. కేదార్‌ మృతి ఘటనలో ఎలాంటి ప్రమేయం లేనప్పుడు.. విచారణ జరిపించాలని ఎందుకు డిమాండ్‌ చేయట్లేదన్నారు.

Updated Date - Feb 28 , 2025 | 04:05 AM