Harish Rao: మహిళలకు రూ.60 వేలు ఇచ్చి సారె పెట్టాల్సిందే: హరీష్ రావు
ABN , Publish Date - Nov 25 , 2025 | 02:44 PM
మహిళలకు కాంగ్రెస్ సర్కార్ చీరలు పంపిణీ చేసే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ కేవలం ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో ఉన్న 40 లక్షల మంది మహిళకు మాత్రమే చీరలు ఇస్తున్నారని అన్నారు.
సిద్దిపేట, నవంబర్ 25: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) ప్రతి బతుకమ్మ పండుగకు18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మహిళలకు చీరలు అందించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Former Minister Harish Rao) తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సిద్దిపేట నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల 83 వేల మంది మహిళలు ఉంటే లక్ష 99 వేల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారన్నారు.
ఒక్క ఏడాదికి మాత్రమే చీర ఇచ్చి సారె పెట్టిన అని అంటున్నారని.. కానీ మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వాల్సిన రూ.60 వేలు ఇచ్చి సారె పెట్టాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో చీరలు లేవు, వడ్డీలేని రుణాలు లేవని వ్యాఖ్యలు చేశారు. మహిళా సంఘాలు రూ.25 వేల కోట్ల రుణాలు తీసుకుంటే రూ.5 వేల కోట్లకు మాత్రమే వడ్డీలేని రుణం వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగబడుతోందని.. మొత్తం డబ్బులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్త్రీ నిధికి కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం జిల్లాలోని మహిళ సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామని నేటికి ఒక్క మెగావాట్ పవర్ ఎక్కడా కూడా పెట్టలేదని విమర్శించారు. కేసీఆర్ పండుగ పండగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల ఓట్లకు సంకేమ పథకాలు ఇస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి...
మతపరమైన దీక్షలపై పోలీసు శాఖ కఠిన ఆదేశాలు
తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెర
Read Latest Telangana News And Telugu News