Mahesh Kumar Goud: 'అహనా పెళ్లంట' వ్యాఖ్యలు.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్
ABN , Publish Date - Nov 01 , 2025 | 07:11 PM
సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి.. కేబినెట్‌లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, నవంబర్ 1: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. 'అహనా పెళ్లంట' మాట బీఆర్ఎస్ పార్టీకి సరిగ్గా సరిపోతుందని కౌంటర్ ఇచ్చారు. సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి.. కేబినెట్‌లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ సహకరించిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్, కేటీఆర్ పై నిప్పులు చెరిగారు మహేష్ గౌడ్.
బీఆర్ఎస్ పార్టీ రుణం తీర్చుకోవడానికి బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందని దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రపతి పదవి మొదలుకొని ట్రిపుల్ తలాక్ వరకు బీజేపీకి కేసీఆర్ మద్దతు ఇచ్చారని అన్నారు మహేష్ గౌడ్. డబ్బుతో ఓట్లను కొలవడమనేది అనైతిక చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే రూ.5వేలు తీసుకోండి.. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి? అంటూ కేటీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యగా పేర్కొన్నారు.
ఎలక్షన్ కమిషన్ తక్షణమే కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మెజార్టీ అమలు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసి ఓట్లు అడుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని అమాయకులైన నిరుద్యోగులను బలిగొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబంలో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి:
CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Metro: ప్రయాణికులకు అలర్ట్.. మెట్రో టైమింగ్స్ సవరణ