Rains: కమ్మేసిన ముసురు.. చిరుజల్లులతో అవస్థలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 08:06 AM
నగరాన్ని ముసురు కమ్మేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు ముసురు, చిరుజల్లులతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారాయి.

- అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- షేక్‌పేటలో అత్యధికంగా 8.6 సెం.మీ
హైదరాబాద్ సిటీ: నగరాన్ని ముసురు కమ్మేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు ముసురు, చిరుజల్లులతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారాయి. నాగోల్ రాక్‌టౌన్ కాలనీ, హయత్‌నగర్, వనస్థలిపురం, మధురానగర్, ఉప్పల్, బండ్లగూడ(Uppal, Bandlaguda), బహుదూర్‌పురా, సైదాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్ ప్రాంతాల్లో కురిసిన చిరుజల్లులతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
మంగళవారం రాత్రి కుండపోత
మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి బుధవారం 7 గంటల వరకు షేక్‌పేటలో అత్యధికంగా 8.6 సెం.మీ, టోలిచౌకి లో 6.5 సెం.మీ వర్షం కురిసింది. గోల్కొండ, లంగర్‌హౌజ్, గచ్చిబౌలి, చందానగర్, కేపీహెచ్‌బీ, హఫీజ్‌పేట, మియాపూర్, మాదాపూర్, ఆసి్‌ఫనగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. బుధవారం ఉదయం హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించాయి.
మరో రెండురోజులు వర్షాలు
గ్రేటర్‌లో మరో రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలుంటాయని పేర్కొన్నారు.
రాత్రి భారీ వర్షం
పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, హఫీజ్‌పేట, జూబ్లీహిల్స్, బంజారహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, సికింద్రాబాద్, బోయినిపల్లి, బేగంపేట, పంజాగుట్ట, అల్వాల్, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రాత్రి పది గంటల వరకు కుత్బుల్లాపూర్ మహదేవపురంలో అత్యధికంగా 1.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
మంగళవారం రాత్రి 8.30 నుంచి బుధవారం ఉదయం7 గంటల వరకు వర్షపాతం (సెం.మీ)
- షేక్‌పేట - 8.6 - టోలిచౌకి - 6.5 - లంగర్‌హౌస్ - 6.1 - గచ్చిబౌలి - 5.8 - లింగంపల్లి - 5.2 - చందానగర్ - 4.6 - కేపీహెచ్‌బీ- 4.5
- హఫీజ్‌పేట - 4.2 - మియాపూర్- 4.1
- మాదాపూర్ - 3.8 - ఆసిఫ్‌నగర్ - 3.7
- అత్తాపూర్- 3.7 - జియాగూడ- 3.6
- గోల్కొండ - 3.3 - పటాన్‌చెరువు - 3.3.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు
Read Latest Telangana News and National News