Share News

Bhatti Vikramarka: దేశ ఆర్థిక వృద్ధిలో పీవీ పాత్ర కీలకం

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:39 AM

మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు.

Bhatti Vikramarka: దేశ ఆర్థిక వృద్ధిలో పీవీ పాత్ర కీలకం

  • ప్రధాని నరేంద్ర మోదీ

  • ఆర్థిక సరళీకరణతో చెరగని ముద్ర: ఖర్గే

  • పీవీ సేవలు చిరస్మరణీయం: రేవంత్‌ రెడ్డి

  • పీవీ ఇక్కడ పుట్టడం మన అదృష్టం: భట్టి

  • బహుభాషా కోవిదుడు పీవీ: ఎంపీ లక్ష్మణ్‌

  • విద్యారంగానికి ఎనలేని సేవలు: కేటీఆర్‌

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌/ రాంగోపాల్‌పేట్‌/ భీమదేవరపల్లి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఉన్న పీవీ ఘాట్‌ వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీవీ అభిమానులు పుష్పాంజలి ఘటించారు. అలాగే గాంధీభవన్‌లో, శాసనసభ లాబీలో, పీవీ పుట్టిన ఊరు వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి, స్వగ్రామం భీమదేవరపల్లి మం డలం వంగరలో పీవీ జయంతిని ఘనంగా నిర్వహించారు. నరసింహారావు దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. దేశ ఆర్థిక వృద్ధిలో నరసింహారావు పాత్ర కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆర్థిక, రాజకీయ పరివర్తన కీలకమైన దశలో ఉన్న దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారని తెలిపారు. ఆయన సేవలను ఎక్స్‌ వేదికగా మోదీ గుర్తు చేసుకున్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన పీవీకి దేశం కృతజ్ఞతలు చెబుతోందని తెలిపారు.


నరసింహారావు ప్రభుత్వం అనుసరించిన విస్తృత శ్రేణి ఆర్థిక సరళీకరణ విధానాలతో దేశం అన్ని రంగాల్లోనూ గణనీయమైన వృద్ధిని సాధించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. దేశాభివృద్ధిలో ఆయనది చెరగని ముద్రన్నారు. పీవీ సంస్కరణలతో మధ్యతరగతికి ఎంతో మేలు జరిగిందన్నారు. పీవీ బహుభాషా కోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పీవీ దూరదృష్టితో చేపట్టిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాయని గుర్తు చేశారు. పీవీ తెలంగాణలో పుట్టడం మన అదృష్ట్టమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో అనేక సంస్కరణలకు ఆఽధ్యుడు పీవీ అని కొనియాడారు. పీవీ మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తోందని చెప్పారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. పీవీ సేవలను గుర్తిం చి ప్రధాని మోదీ ప్రభుత్వం వారికి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పీవీ సేవలను విస్మరించి రాజకీయంగా ఇబ్బందులకు గురి చేశాయన్నారు. ప్రధానిగా ఆర్థిక సంస్కరణలను తెచ్చి దేశాన్ని భారీ సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి పీవీ నరసింహారావు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కొనియాడారు. గురుకుల విద్యాలయాలకు అంకురార్పణ చేసి విద్యారంగానికి ఎనలేని సేవలు చేశారన్నారు.


ఇవి కూడా చదవండి

పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..

మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్

Updated Date - Jun 29 , 2025 | 03:39 AM